
సాక్షి, అమరావతి : 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ లక్షా 91వేల 63 కోట్లతో ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ 1,50,270 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ 28,678 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటును రూ 24,205 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బడ్జెట్ 21.70 శాతం పెరిగింది.
కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదని, కేంద్రం సహకరిస్తే మరింత పురోగతి సాధించే అవకాశం ఉండేదని యనమల పేర్కొన్నారు. నిరాశ, నిస్తేజంల మధ్యే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాలతో సమానంగా ఎదిగేందుకు పట్టుదలతో పోరాడతామన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకు సాగుతున్నామన్నారు. బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశామని యనమల చెప్పారు.