ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని అన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 11.52 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు.
మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల మరణించిన ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతామన్నారు. ఈనెల 20న స్పీకర్ ఎన్నిక జరుగుతుందని యనమల పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈ సమావేశాల్లో ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 21న ఉదయం 8.55 గంటలకు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని యనమల చెప్పారు. అలాగే 23,24 తేదీల్లో ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుందని ఆయన తెలిపారు.