పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ శుక్రవారం 63 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్లలో నిరసన వ్యక్తంచేశారు.
పసుపు రైతులు కదం తొక్కారు. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ శుక్రవారం 63 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్లలో నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తమ డిమాండ్లు తీర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మెట్‌పల్లి/కోరుట్లరూరల్/జగిత్యాలజోన్ న్యూస్‌లైన్ : తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ పసుపు రైతులు పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా పాతబస్టాండ్ చేరుకుని ఆందోళన చేశారు. సీఐ దే వేందర్‌రెడ్డి వచ్చి ఆందోళన విరమించాలని కోరగా.. రైతులు ఒప్పుకోకపోవడంతో సిబ్బందితో వారిని అక్కడి నుంచి తొలగించారు.
పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు, స్వదేశీజాగరణ మంచ్ కన్వీనర్ మారు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. కోరుట్లలోని 63 నంబరు జాతీయ రహదారిపై పసుపు రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కోరుట్ల, కథలాపూర్, రాయికల్ రైతులు భారీగా తరలివచ్చారు. పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డునుంచి నందిచౌరస్తా వరకు రైతులు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలోని కొత్త బస్టాండ్ వద్ద నిజామాబాద్-కరీంనగర్ హైవేను అన్నదాతలు రెండు గంటలపాటు దిగ్బంధం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.