
టీడీపీలో చేరిన డేవిడ్ రాజు
విజయవాడ/యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఆదివారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరినట్టు డేవిజ్ రాజు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్టు డేవిడ్ రాజు తెలిపారు. యర్రగొండపాలెం అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీయిచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. అంతకుముందు టీడీపీలో 24 ఏళ్ల పాటు పనిచేశానని గుర్తుచేశారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని అన్నారు.
డేవిడ్ రాజు పార్టీ ఫిరాయించడంపై యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వలాభం కోసమే పార్టీ మారారని ఆరోపించారు. డేవిడ్ రాజు ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు.