స్నాతకోత్సవంలో విద్యార్థుల పట్టాభిషేకం
⇒ బంగారు పతకాలు అందుకున్న ప్రతిభావంతులు
⇒ మాజీ సీఈసీ వి.ఎస్.సంపత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
⇒ ప్రణాళికతో సవాళ్లను అధిగమించవచ్చు : సంపత్
⇒ విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తాం: వీసీ శ్యాంసుందర్
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కనులపండువగా సాగిన ఈ సంబరానికి విద్యార్థులు ప్రత్యేక దుస్తులు (గౌనులు) ధరించి హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి వి.ఎస్. సంపత్ లైబ్రరీ బిల్డింగ్ వద్ద గౌరవవందనం స్వీకరించారు. అనంతరం వైస్‌చాన్స్‌లర్,రిజిస్ట్రార్, డీన్‌లు ఆయనతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు.
కార్యక్రమానికి వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఈసీ సంపత్ మాట్లాడుతూ యువ పట్టభద్రులారా.. చక్కటి ప్రణాళికలతో సవాళ్లను అధిగమించవచ్చని తెలిపారు. స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. స్వచ్ఛ ఇంధనాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే తను వైవీయూలో 20 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని పేర్కొన్నారు.
⇒ పట్టభద్రులంతా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం సంపత్‌కు వైస్‌చాన్స్‌లర్ శ్యాంసుందర్ గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ 2012లో మొదటి స్నాతకోత్సవం నిర్వహించామని, ఇప్పుడు 2, 3,4, 5వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతం ఇస్తూ ర్యాగింగ్‌ను దూరంగా ఉంచుతూ చక్కటి వాతావరణం నెలకొనేలా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో డిజిటల్ లైబ్రరీ, ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలను అందిస్తామని తెలిపారు. అధ్యాపక బృందం రూ.19 కోట్ల విలువైన 72 పరిశోధక ప్రాజెక్టులతో పాటు వివిధ సంస్థల నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పొందారన్నారు. అనంతరం పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ సబ్జెక్టుల్లో ప్రథములుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.
⇒ అనంతరం లాంఛనంగా డిగ్రీ, డిప్లొమా పట్టాలకు సంబంధించిన రికార్డుపై సంతకం వీసీ సంతకం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.వై.నజీర్‌అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య బి. జయపాల్‌గౌడ్, డీన్‌లు ఆచార్య కె.వలీపాషా, జయచంద్రారెడ్డి, శ్రీనివాస్, సాంబశివారెడ్డి, గులాంతారీఖ్, ఆర్థికశాఖ కార్యదర్శి సుబ్రమణ్యం, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు బెరైడ్డి రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, అక్బర్‌ఖాన్, నాగార్జున విద్యాసంస్థల చైర్మన్ శివశంకర్‌రెడ్డి, డెరైక్టర్ శ్రీదేవి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.