అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Young man killed in suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Thu, Dec 10 2015 1:08 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

Young man killed in suspicious circumstances

ఆగర్రు (పాలకొల్లు అర్బన్) : ఆగర్రు శివారు చిట్టివానిగర్వుకు చెందిన గుబ్బల పెద్దిరామ్ (27) అతని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాలు ఇవి.. పెద్దిరామ్ పెనుమంట్ర కేఎస్‌ఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బిఈడీ చదివాడు. అదే కళాశాలలో 2013 ఆగస్టు నుంచి లైబ్రేరియన్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కళాశాల విధులు ముగించుకుని బైక్‌పై తన చెల్లెలు కమల అత్తవారిల్లు అయిన యలమంచిలి మండలం కాజ వెళ్లాడు.
 
  చెల్లెలి పిల్లలను బుధవారం ఆసుపత్రిలో చూపించే నిమిత్తం  తనతోపాటు రాత్రి 7 గంటలకు చిట్టివానిగర్వులో తన ఇంటికి తీసుకువచ్చా డు. అదే గ్రామంలోని అతని మిత్రు డు నేలపూడి ప్రదీప్ గల్ఫ్ నుంచి రావడంతో అతని వద్దకు వెళ్లి కబుర్లు చెప్పుకుని అక్కడే భోజనం చేశాడు. రాత్రి అతను ఇంటికి ఎప్పుడు చేరుకున్నాడో తల్లిదండ్రులకు తెలియదు. ఉదయం అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, అనసూయమ్మ చూసేసరికి పెద్దిరామ్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడిఉన్నాడు. అతని చెవి, ముక్కులోనుంచి రక్తం వచ్చింది. శరీరంపై గాయాలు లేవు.  మృతుని ఇంటికి సమీపంలో రోడ్డుపై రక్తపు మరకలు పడి ఉండటం అనుమానాలకు తావి చ్చింది. పాలకొల్లు రూరల్ సీఐ ఆరిమిల్లి చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
 క్లూస్ టీమ్ పరిశీలన
 ఏలూరు నుంచి వచ్చిన వేలిముద్రల విభాగం ఎస్సై ఎం.రాజేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్వ్కాడ్ తీసుకువచ్చిన జాగిలం పేటలోనూ, అక్కడ నుంచి ఆగర్తిపాలెం వెళ్లే రోడ్డులోనూ, చందపర్రు వెళ్లే రోడ్డులో తిరిగింది.  
 
 కూలి సొమ్ముతో డబుల్ ఎంఏ, బీఈడీ
 పెద్దిరామ్ చిన్నతనం నుంచి కష్టజీవి. తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులైన వ్యవసాయ కూలీలు. అతను వ్యవసాయ పనులు చేస్తూనే డబుల్ ఎంఏ, బీఈడీ చదివాడు.  ఉద్యోగం వచ్చిన తరువాత వివాహం చేసుకుంటానని స్నేహితులతో చెప్పేవాడు.
 
 జుట్టు కోసం వాడుతున్న మందు వికటించిందా!
 పెద్దిరామ్ తల జట్టు ఊడిపోయి బోడిగుండులా మారింది. జుట్టు కోసం అతను తలకు ఓ ద్రవం రాసుకునేవాడు. దానితోపాటు మాత్రలు వాడేవాడు. ఆ మాత్రలు అయిపోయాయని, రాజమండ్రి వెళ్లి తెచ్చుకోవాలని అతను మిత్రుడు ప్రదీప్ వద్ద ప్రస్తావించినట్టు పోలీసులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement