
సాక్షి, ఆనందపేట(గుంటూరు) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి షాట్ రెడీ... పేకప్ అన్న రీతిలో ఉందని బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ అన్నారు. స్థానిక చుట్టుగుంటలోని రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షాట్ రెడీ అన్నప్పుడు షూటింగ్‌లో పాల్గొన్నట్లు పవన్ కల్యాణ్ జనంలోకి రావటం, పేకప్ చెప్పగానే షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోయినట్లు పత్తా లేకుండా పోవటం పరిపాటిగా మారిందని విమర్శించారు.
ప్రజలకు ఎలాంటి మేలు జరగదు..
ఆరు నెలలకోసారి ప్రత్యక్షమయ్యే పవన్ వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగదని చెప్పారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే పవన్ కల్యాణ్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఉనికిని చాటుకునేందుకు జనం మధ్యకు వచ్చే పవన్ కల్యాణ్‌ను ప్రజలు సైతం నమ్మటం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తన వ్యవహార శైలి మార్చుకుని జనం మధ్యలోకి వచ్చి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.