
సాక్షి, న్యూఢిల్లీ : యురేనియం టెయిల్ పాండ్ నిర్మాణ లోపాల కారణంగా కడప నియోజకవర్గంలోని 7 గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లోక్‌సభలో లేవనెత్తారు. మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతో.. యురేనియం టెయిల్ పాండ్ నిర్మాణ లోపాల వల్ల పంటలకు, పశుసంపదకు తీవ్రనష్టం ఏర్పడుతోందని వివరించారు. రసాయన వ్యర్థాలు కలవడం వల్ల భూమి, నీరు కలుషితం అవుతున్నాయని తెలిపారు. దీనిపై యూసీఐఎల్ సీఎండీకి ఎన్నిసార్లు వినతి పత్రాలు పంపినా స్పందన లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమస్యపై తక్షణమే స్పందించి.. ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
పామాయిల్ మద్దతు ధర పరిశీలనలో ఉంది : కేంద్రం
పామాయిల్ మద్దతు ధర అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభలో లేవనెత్తింది. పామాయిల్‌కు మద్దతు ధర ప్రకటించాలని సీఏసీపీ కూడా సిఫార్సు చేసిందని ఆ పార్టీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాల.. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పామాయిల్ ధరల నిర్ణయం జరుగుతోందని తెలిపారు. అయితే పామాయిల్‌కు మద్దతు ధర అంశం పరిశీలనలో ఉందన్నారు.