గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా | YS Jagan backs Ramavarappadu oustees | Sakshi
Sakshi News home page

గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా

Published Tue, Feb 16 2016 4:33 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా - Sakshi

గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా

రోజుకూలికెళితే తప్ప పూటగడవని పేదలు వారు.. చిన్న బడ్డీకొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నవారు మరికొందరు.. విజయవాడలో రామవరప్పాడు వద్ద రోడ్డుపక్కన నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు వారి గూడును పీకేసింది.. దీంతో తల్లడిల్లిపోతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  బాధితులు తమ ఆవేదనను జగన్‌మోహన్‌రెడ్డికి వివరించి కన్నీరు పెట్టుకున్నారు.
 
* పేదల తరఫున కోర్టులో కేసు వేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం
* పోరాటం చేయాలని బాధితులకు పిలుపు
* గ్రీన్ జోన్‌పై జననేతకు రైతుల వినతి
* నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సతీమణికి నివాళి
* విజయవాడలో సామినేని ఉదయభాను మాతృమూర్తికి పరామర్శ

 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడలో రామవరప్పాడు వద్ద ఇళ్లు కోల్పోయిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. రోడ్డు పనులు చేస్తున్న ప్రదేశాన్ని, గుడిసెలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు తమ కష్టాలను ఆయన ఎదుట మొరపెట్టుకున్నారు. ప్రధానంగా మహిళలు తమ గోడు వినిపించారు. ‘అన్నా... ఇటువంటి ప్రభుత్వాన్ని మేమెప్పుడూ చూడలేదన్నా... చంద్రబాబునాయుడు రోడ్డు వెంట వెళ్లేటప్పుడు గుడిసెలు కనిపించకూడదట.. ఇంత దారుణమా’ అంటూ వాపోయారు.
 
పోరాడండి.. అండగా నిలుస్తాం..
అన్యాయం జరిగినప్పుడు పోరాటమే మార్గం... మీ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.. అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండని జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే 120 మంది గుడిసెలు తొల గించారని, ఇంకా 600 మంది గుడిసెలు ఉన్నాయని, వాటిని కూడా తొలగిస్తారంటున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేయగా ‘మీకేం భయం లేదు.. పోరాడండి’ అని భరోసా ఇచ్చారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నానిలతో మాట్లాడుతూ వెంటనే కోర్టులో కేసు వేయించాలని చెప్పారు.

బాధితుల తరఫున మనం పోరాడదామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారని, పేదలపై కనీసం కనికరం కూడా చూపకుండా, ప్రత్యామ్నాయం చూడకుండా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
 
ఉదయభాను మాతృమూర్తికి పరామర్శ...
అనంతరం ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సామినేని ఉదయభాను మాతృమూర్తి పద్మావతిని వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయభానుతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ఆమె యోగక్షేమాలను  తెలుసుకున్నారు.
 నూజివీడులో ఎమ్మెల్యే సతీమణికి నివాళి
 నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సతీమణి సుజాతాదేవి భౌతికకాయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.

సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి విజయవాడ నుంచి నేరుగా చేరుకున్న జగన్.. పలువురు బంధువులు, ఎమ్మెల్యే అప్పారావును పరామర్శించారు. మధ్యాహ్నం తరువాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. మార్గం మధ్యలో జి.కొండూరు మండలంలోని వెంకటాపురంలో స్థానికులు ఆపి జననేతకు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ విగ్రహానికి స్థానిక నాయకులతో పూలమాల వేయించారు. అనంతరం జి.కొండూరులో స్థానిక నాయకులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు.

వైఎస్ జగన్ వెంట పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, జలీల్‌ఖాన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా,  కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆర్.వెంకటేశ్వరరావు, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ ఉన్నారు.
 
రైతుల వినతి...
ఆ తరువాత ఇబ్రహీంపట్నం వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఇంటి వద్ద కాసేపు ఆగారు.  అక్కడ ఆయనను జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌జోన్ పేరుతో రైతుల పొలాలపై పెత్తనం చేసేందుకు వ్యూహం పన్నారని, దీనిని ఎలాగైనా ఆపాలంటూ రైతులు వినతిపత్రం సమర్పించారు. భూమిని అమ్మేందుకు భూ యజమానికే హక్కు లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. దీనిపై తప్పకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను పరిశీలించి ఆందోళన ఉధృతం చేయాలని పార్టీ వారికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement