
పేదలకు అండగా దీక్షలు చేస్తాం
► వైఎస్‌ఆర్‌సీపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి
► రామవరప్పాడు రోడ్డు బాధితులకు అండగా ఉంటాం
► కోర్టు తలుపులు తడతాం, నిరాహార దీక్షలు చేస్తాం
► అభివృద్ధి పేరుతో పేదల కడుపులు కొడుతున్నారు
► చంద్రబాబు చేస్తున్న దారుణాలు ఎండగడతాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న పేదల పక్షాన నిలబడి పోరాడతామని, వారికి న్యాయం చేసేంతవరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని, కోర్టు తలుపులు తడతామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. ఆయన సోమవారం కృష్ణాజిల్లా నూజివీడు వెళుతూ మార్గమధ్యలో విజయవాడ నగర శివారులోని రామవరప్పాడులో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో గుడిసెలు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ‘‘అన్నా... టీడీపోళ్లు అభివృద్ధి పేరుతో దారుణాలు చేస్తున్నారు. ఆడోళ్లకు న్యాయం చేయాలని కూడా లేదు.
ఈ ప్రభుత్వం ఏమి ప్రభుత్వం?’’ అంటూ బాధిత మహిళలు జగన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదన చూసి చలించిన జగన్ రోడ్డు కోసం పేదల గుడిసెలను తొలగిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... ఇక్కడ టీడీపీ కార్పొరేటర్ హోటల్‌ను కాపాడేందుకు ఫ్లై ఓవర్ అలైన్‌మెంట్‌ను మార్చేసి 120 ఇళ్లను తొలగించారని చెప్పారు. ఇప్పుడు మరో 500 ఇళ్లను తొలగించేందుకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. నలభై, యాభై ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న పేదలకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వారి కడుపులు కొడుతున్నారని దుయ్యబట్టారు.
వారికి ఇష్టంలేకపోయినా బలవంతంగా వారి ఇళ్లు బుల్‌డోజర్లు పెట్టి తీసేస్తున్నారని, వారి మసీదులు కొట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చంద్రబాబు ఇలా వెళుతుంటే ఎక్కడా గుడిసెలు కనపడకూడదట. చిన్న చిన్న షాపులు కనపడకూడదట. పెద్దపెద్ద మాల్స్ మాత్రమే కనిపించాలట. అందుకే తమ ఇళ్లు కూల్చేస్తున్నారని పేదలు చెబుతున్నారు’’ అని వివరించారు. ఇదే కృష్ణా జిల్లాలో సనత్‌నగర్, తాడిగడప, యనమలకుదురు, రామవరప్పాడు, నిడమానూరు, నైనవరం అన్నిచోట్ల భూములు లాకుంటున్నారని, బాధితులకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. తమ చేతిలో అధికారం ఉందని దారుణాలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరని, తాము పేదల పక్షాన నిలబడి పోరాడతామని, వారికి న్యాయం చేసేందుకు కోర్టులకు వెళతామని హెచ్చరించారు.
మేకా సుజాతదేవికి నివాళులు
సాక్షి, నూజివీడు: సతీవియోగంతో బాధపడతున్న నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకటప్రతాప్ అప్పారావుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతాప్ సతీమణి మేకా సుజాతదేవి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలుసుకున్న జగన్ ముందుగా ఫోన్‌లో పరామర్శించారు. అనంతరం విజయవాడ నుంచి సోమవారం ఉదయం 11.30 గంటలకు నూజివీడు చేరుకుని సుజాతదేవి పార్ధివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ప్రతాప్‌ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతాప్ కుమారుడు మేకా వేణుగోపాల అప్పారావు(చంటినాయన)ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ తరువాత 12.15 గంటలకు నూజివీడు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరివెళ్లారు.
ముస్తాక్ అంత్యక్రియలకు హాజరు కానున్న జగన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లాకు రానున్నారు. సియాచిన్ ఘటనలో అమరుడైన కర్నూలు జిల్లా పార్నపల్లెకు చెందిన భారత జవాను ముస్తాక్ అహ్మద్(30) అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం ముస్తాక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అంత్యక్రియలకు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు.