
సాక్షి, అమరావతి, బద్వేలు/కడప ఎడ్యుకేషన్: ఉద్యోగుల పాలిట నో పెన్షన్ స్కీమ్‌గా మారిన భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్)ను ఎత్తివేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గత కొన్నేళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 1.86 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్) పరిధిలో ఉన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉన్నత విద్యామండలి, ఆరోగ్య, పోలీసు తదితర శాఖలలో మరో 60 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానానికి వ్యతిరేకంగా అప్పట్నుంచే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గత సెప్టెంబర్ ఒకటిన రాజధాని అమరావతికి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉద్యోగులు మిలియన్ మార్చ్ చేపట్టారు. అదే రోజూ సామూహిక సెలవుదినాన్ని పాటించారు. అంతకుముందు కూడా ఎన్ని ఆందోళనలు చేపట్టినా, ఎంతగా విన్నవించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ పరిస్థితుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల ఆశలకు ఊపిరి పోశారు.
సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చిన ఎన్డీయే
పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని, అది ఉద్యోగికి, అతని కుటుంబ జీవనానికి అనువుగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఉద్యోగిగా ఉన్నప్పటి హోదాకు తగ్గకుండా జీవించడానికి అనువుగా అది ఉండాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నో పోరాటాలు చేసి పెన్షన్ విధానాన్ని సాధించుకున్నారు. అయితే ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించే పెన్షన్‌ను మోయలేని భారంగా పేర్కొంటూ దాన్ని వదిలించుకున్నాయి. అప్పటి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నోటిఫికేషన్‌తో 2004 జనవరి 1 నుండి నూతన పెన్షన్ పథకం (సీపీఎస్)ను అమలులోకి తెచ్చింది. ప్రభుత్వాలు పెన్షన్ చెల్లించే బాధ్యత నుండి తప్పుకునేలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమలు చేసింది. దీంతో రాష్ట్రంలో 1.8 లక్షల మందికి పైగా ఉద్యోగులు రిటైర్‌మెంట్ తర్వాత లభించే జీవన భద్రతను కోల్పోయారు. వారి కుటుంబాలకు రక్షణలేని పరిస్థితి ఏర్పడింది.
స్వాగతిస్తున్నాం: ఫ్యాప్టో
వైఎస్ జగన్ ప్రకటన అభినందనీయం. దీనిని మేము స్వాగతిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దుకు వీలుగా ముందుకు రావాలి. ఈ విషయంలో టీడీపీ రెండునాల్కల ధోరణిలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున సీపీఎస్ రద్దుకు వారిని ఒప్పించాలి.
– పి.బాబురెడ్డి (చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)
భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు
సీపీఎస్ రద్దుపై జగన్ ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. ఇది ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడమే. ఉద్యోగులకు పింఛన్ లేకుండా చేసిన ప్రభుత్వం.. ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయ నేతలకు మాత్రం పింఛన్ ఇస్తోంది.
– జీవీ నారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు: ఏపీటీఎఫ్
2004 సెప్టెంబర్ 1 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 86 వేల మంది ఉన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే వీరందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతారు.
– శ్యాంసుందర్‌రెడ్డి (ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు)
ఇతర పార్టీలు స్పందించాలి
సీపీఎఎస్ రద్దుపై, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన విధానాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇతర పార్టీలు కూడా తమ విధానాన్ని ప్రకటించి సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి.
– కత్తి నరసింహారెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ)
వైఎస్ జగన్ ప్రకటన హర్షణీయం
ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తానని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని వైఎస్ జగ¯Œ ప్రకటించటం హర్షణీయం. – కె.జాలిరెడ్డి, కె.ఓబుళపతి (ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు)
Comments
Please login to add a commentAdd a comment