
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమ ఫలాలు అందేవి. బీసీ రుణాలతో ఆ సామాజిక వర్గం వారు ఆర్థికాభివృద్ధి సాధించేవారు. టీడీపీ అధికంలోకి వచ్చిన తరువాత బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బీసీలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం చంద్రబాబు వారి సంక్షేమాన్ని అటకెక్కించారు. ఆ సమయంలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టి బీసీల కష్టాలను తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అదనంగా పదిశాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం సంచలన నిర్ణయం
ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో బీసీ, ఉపకులాలకు సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెంచినప్పటికీ టీడీపీ వేసిన పిటిషన్ల కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదు. 50 శాతానికే రిజర్వేషన్లు నిర్ణయించాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో కోర్టు తీర్పును గౌరవించిన అధికారపార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోవడంలోనూ వెనుకంజ వేయలేదు. జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో కొన్నింటిని బీసీలకు ఇవ్వడం ద్వారా మరో కోర్టు తీర్పు వల్ల కోల్పోయిన 10 శాతం రిజర్వేషన్లను పార్టీ తరఫున ఇస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంచలన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వైఎస్ అలా.. చంద్రబాబు ఇలా..
బీసీ వర్గాల్లో చదువుకునే విద్యార్థులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కరంటే ఒక్కరికీ ఫీజులు గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌గానీ పెండింగ్ లేకుండా అందజేసేవారు. చంద్రబాబు హయాంలో జిల్లాలో 74,800 మంది విద్యార్థులు ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌కోసం ఎదురుతెన్నులు చూసేవారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టలేక అల్లాడారు. ఉన్నత తరగతులకు వెళ్లాల్సిన వారు, ఇతర కళాశాలలకు వెళ్లాల్సిన వారికి ఫీజులు కట్టడం లేదని ఆయా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధించాయి. ఎంతో ఉన్నత ఆశయంతో ఆనాడు వైఎస్ తలపెట్టిన ఈ ఫీజురీఎంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు కానివ్వలేదు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఫీజులకు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం చెల్లించేవారు. దీంతో పూర్తిగా విద్యార్థుల పేరిట కళాశాలలకు ఫీజులందేవి. తల్లిదండ్రులకు కూడా ఎటువంటి ఆవేదన కానీ, ఇబ్బందులు కానీ పడేవారు కాదు. చంద్రబాబు హయాంలో విద్యార్థి సంఘాలు పోరాడుతుంటే పోలీసులతో వారిని చావగొట్టించారు. వైఎస్ హయాంలో కొన్ని కులాలను బీసీల్లోకి చేర్చి వారికి అన్ని రంగాలలోను అభివృద్ధి చెందేలా దోహదపడ్డారు. కొన్ని కులాల వర్గీకరణ లేకపోతే వర్గీకరణ చేసి వారికి వివిధ పథకాల ద్వారా న్యాయం జరిగింది. ప్రతి కుటుంబానికి పింఛన్, పేద రైతుకు ఉచిత విద్యుత్‌ని అందజేసి ఆదుకున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు దిశా, దశాలేని కులాలకార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన చేశారు.
తండ్రిని మించిన తనయుడు...
మళ్లీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. బీసీల్లో 135 ఉపకులాలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 14.40 లక్షల బీసీ జనాభా ఉంది. తూర్పుకాపు, యాదవ, కుమ్మరి, చాకలి, వండ్రంగి, కంసాలి, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, యాత, ఈడిగ, తదితర కులాలు అధికంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఏలూరులో బీసీ గర్జన సదస్సు నిర్వహించిన జగన్ వారికి భరోసా ఇచ్చారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చాచు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వారికి తీపి కబురు చెప్పారు. క్షౌ రశాలలకు 250 యూనిట్లు విద్యుత్ ఉచితం ఇస్తామన్నారు. డొమెస్టిక్ పర్పస్ 500 యూనియట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల్లో ఉద్యోగులకు ట్రస్టుబోర్డులో నామిటెడ్‌పోస్టులో అవకాశం ఇస్తామన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ఇచ్చారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పదిశాతం అదనంగా సీట్లు కేటాయించిన వైఎస్ జగన్ మడమ తిప్పని నైజంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఔదార్యం మరువలేనిదని, ఆయన రుణం తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశ్వసనీయతకు నిదర్శనం సీఎం
ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలుచేస్తున్న ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగా బీసీల గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ఇక బీసీల పయనమంతా ఆయన వెంటే.
– ముద్దాడ మధు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం
తండ్రిని మించిన తనయుడు
తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరుతెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలో మంచి సీఎంగా మన్ననలు పొందుతున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు మానవతా దృక్పథంతో బీసీల అభ్యున్నతికి చట్టబద్ధంగా అడుగులు వేయడం అభినందనీయం. బీసీల అభివృద్ధిని కాంక్షించే సీఎంగా పేరుకెక్కారు.
– సానమునేటి శ్రీనివాసరావు, నగరాల సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం
సముచిత స్థానం
బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సేవ చేస్తారని అనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పులోగాని, బడ్జెట్ కేటాయింపుల్లో గాని బీసీలకు సముచిత స్థానం కలి్పంచారు. గత 30 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయలేని విధంగా చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి. ఆయనలో అద్భుతమైన ఆలోచనలు, ఆచరణలు కనిపిస్తున్నాయి.
– రామేశ్వరపు రామారావు, నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విజయనగరం
బీసీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
బీసీల అభివృద్ధి, సంక్షేమం సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. గతంలో అధికారంలో లేకపోయినా బీసీల పక్షపాతిగా సేవలందించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి గుర్తింపునిచ్చారు. ఎన్నికల్లో బీసీలంతా జగన్‌మోహన్‌రెడ్డికి ఏకపక్షంగా ఓట్లు వేశారు.
– లెంక అప్పలరాజు, పూల్‌భాగ్‌కాలనీ, విజయనగరం