
ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా జరపాలి: జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్ష... ముఖ్య నేతల హాజరు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ప్లీనరీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గుంటూరు – విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఎంపిక చేసిన స్థలంలో జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగాలని నిర్ణయించిన విషయం విదితమే. పార్టీ పిలుపు నిచ్చిన విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్లీనరీలు చాలా బాగా జరిగాయని జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచీ చాలా ఉత్సాహంగా జరిగిన ఈ సమావేశాల వల్ల పార్టీ శ్రేణులకు మంచి ఊపు నిచ్చిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టతకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడ్డాయని కూడా ప్రస్తావించారు. అసెంబ్లీ ప్లీనరీల విజయవంతం కావడం ప్రజాభీష్టాన్ని సూచిస్తోందని కూడా నేతలు పేర్కొన్నారు. జిల్లా ప్లీనరీలను కూడా ఇదే ఒరవడిలో పూర్తవుతాయనే ఆశాభావం వ్యక్తం అయింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుగుతోందని కనుక దాని ప్రభావం గుంటూరు, కృష్ణా జిల్లాలపై బాగా ఉంటుందనే విషయం చర్చించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతోందనేది స్పష్టంగా వెల్లడవుతోంది కనుక వచ్చే రెండేళ్లలో ఎన్నికల వరకూ ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ ప్లీనరీలో సిద్ధం చేయాలని నిర్ణయించారు.
అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మళ్లీ ఈ నెల 23వ తేదీన ప్లీనరీ ఏర్పాట్ల సమీక్షపై నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎస్.దుర్గాప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ పాల్గొన్నారు.