సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: వైఎస్ జగన్
అమరావతి: రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?. ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇవాళ్టి నుంచి మిర్చి యార్డ్‌కు సెలవు ప్రకటించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్‌కు సెలవు ఇచ్చారు. రైతులు సమస్యల్లో ఉంటే యార్డ్‌ను మూసేస్తారా?.
మిర్చికి కేంద్రం రూ.5వేలు ఇస్తానన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. రుణమాఫీ విషయంలోనూ మాట తప్పి రైతులను దగా చేశారు. జీఎస్టీ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే రెండు నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. రైతుల సమస్యలపై మాట్లాడదామంటే తప్పించుకుంది. అ అంటే అభివృద్ధి అమరావతి కాదు. అ అంటే అవినీతి, అ అంటే అరాచకాలు, అ అంటే అనారోగ్యం, అ అంటే అబద్ధాలు.’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చేలా బిల్లుకు సవరణలు చేసి ఏపీ అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది.