అక్కినేనికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, హైదరాబాద్: సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయం వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తన సంతాపం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం’ యాత్రలో ఉన్న జగన్.. అక్కినేని మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయంత్రం 6.10 గంటలకు రేణిగుంట నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. రాత్రి 9.15 సమయంలో అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుని.. అక్కినేని భౌతికకాయంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కినేని కుమారుడు నాగార్జున, మనవడు సుమంత్‌ను జగన్ కౌగిలించుకుని మనో నిబ్బరంతో ఉండాలంటూ ధైర్యం చెప్పారు.
ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్ వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు కె.రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అక్కినేని మృతి పట్ల జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలిపారు. అయితే, ‘సమైక్య శంఖారావం’ యాత్రలో ఉన్న జగన్... ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారం చిత్తూరు జిల్లాలోని రెండు మండలాల్లో యాత్ర నిర్వహించాల్సి ఉంది. అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించాలని నిర్ణయించుకున్న జగన్ ఎస్.ఆర్.పురం మండలంలోని గ్రామాల్లో మాత్రమే పర్యటించి.. హైదరాబాద్‌కు బయలుదేరారు. గంగాధర నెల్లూరు మండల పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం ఉదయం మళ్లీ తిరిగివెళ్లి జగన్ యాత్రను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.