కృష్ణారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణారావు కుటుంబాన్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. వారిని ఓదార్చి మనోధైర్యం నింపారు. వైఎస్ జగన్ రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, గ్రామస్తులకు కొండంత ధైర్యం లభించినట్టయ్యింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో కృష్ణారావును ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే.
గొట్టుముక్కలలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణారావు హత్యను తీవ్రంగా ఖండించారు. ఓటు వేయలేదనే కారణంతో ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి హత్య చేయడం దారుణమని అన్నారు. కృష్ణారావును చంపవద్దని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డా హంతకులు కనికరం లేకుండా చంపడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుటే దారుణాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోనే అవనిగడ్డ ప్రాంతంలో ఇంతకుముందు టీడీపీ గూండాలు మందుగుండు సామగ్రి పేలుస్తుంటే, పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారని, ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ఆయన నిలదీశారు. పార్టీ కార్యకర్తలు హత్యలు, దాడులకు గురైన సంఘటనల గురించి ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
ఎన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని వైఎస్ జగన్ చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. దాడుల గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, చంద్రబాబును నిలదీస్తామని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ వెంట కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.