వరుస కరువులున్నా జీడీపీ పెరిగిందా?
బాబు తీరుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆగ్రహం
⇒ ఇది ప్రజలను మోసం చేయడం కాదా?
⇒ గవర్నర్ చేత దారుణమైన అబద్ధాలు చెప్పించారు
⇒ హోదా ఇక ఉండదా.. మరి జీఎస్టీ సవరణ ఎందుకు?
⇒ ప్లాట్ల కేటాయింపులో స్కాం.. రైతులకు అన్యాయం
⇒ బాబు బినామీలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కీలక ప్రాంతాల్లో ప్లాట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వరుసగా మూడేళ్ల నుంచి కరువు విలయతాండవం చేస్తుంటే.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు భారీగా పెరిగిందని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ స్థాయిలో జీడీపీ వృద్ధి రేటు కన్నా రాష్ట్రంలో ఐదు శాతం ఎక్కువగా ఉందని చెబుతుండడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నోటి వెంట చంద్రబాబు ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెప్పించిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణంలో తొలిసారిగా ప్రారంభమైన ఏపీ శాసనసభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన సాయంత్రం 4 గంటలకు తాను విడిది చేసిన ఆర్ అండ్ బీ అతిథిగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు. వివరాలు ఆయన మాటల్లోనే....
‘‘అదేంటో గాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు కొనసాగుతోంది. కరువుతో రైతులు అల్లాడుతూ ఉంటే రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు పెరిగిందని బాబు చెప్పుకుంటున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి ఉంటేనే జీడీపీ పెరిగింది అంటారు. రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి ఉందా? ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి 12.23 శాతం వృద్ధి రేటు సాధించినట్లు, జాతీయ స్థాయి కన్నా ఇది ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దేశం మొత్తం మీద జీడీపీ రేటు 7.1 శాతంగా ఉంటే ఐదు శాతం ఎక్కువ రాష్ట్రంలో పెరిగిందని చెబుతుండటం దారుణం. 2015– 16లో ఏపీ జీడీపీ 10.99శాతం ఉంటే బెంగళూరుతో కూడిన కర్ణాటకలో 6.2శాతం, బాంబేతో కూడిన మహారాష్ట్రలో 8శాతం, గుజరాత్‌లో 7.5శాతం ఉంది. ఎక్కడా ఏపీలాగా పొరపాటు లెక్కలు చెప్పడం లేదు. కానీ జీడీపీ పెరిగిందంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చలో వీటన్నింటిపైనా విశ్లేషణాత్మకంగా వివరిస్తా.
గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం బాధాకరం
ప్రభుత్వం ఏం రాసిస్తే గవర్నర్ దాన్ని చదివి వినిపిస్తారు. గవర్నర్‌లాంటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి చేత అబద్ధాలు చెప్పించడం బాధాకరం. ప్రత్యేక హోదా ఈ ఏడాది మార్చి తరువాత వెళ్లిపోతుందట. ఇది దారుణమైన అబద్ధం. నిజంగా ప్రత్యేక హోదా అనేది ఇక ముగుస్తున్నట్లయితే కేంద్రం జీఎస్‌టీ చట్టంలో ఎందుకు మార్పులు తెస్తున్నది? 122వ సవరణగా ఆర్టికల్ 274ఏ క్లాజ్ 4వ సెక్షన్‌లో ‘ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం’ అని ఉంది. దీనర్థం ఏమిటి? జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తరువాత కూడా ప్రత్యేక హోదా రాష్ట్రాలు కొనసాగుతాయని, వాటికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయనే కదా...
కేసులు పెడితే తప్ప నిజాలు బయటకు రావు
అసలు లాటరీ విధానంలో పారదర్శకత ఉందా? తాము ఎవరికి మంచి ప్లాట్లను ఇవ్వాలనుకున్నారో వారికే ఇచ్చారు. తమకు నచ్చిన వారికి ఇవ్వడం కోసం కొన్ని ప్లాట్లను బ్లాక్ చేసే పద్థతిని అనుసరించారనిపిస్తోంది. వాస్తవాలు బయటకు రావాలంటే ఈ వ్యవహారంపై ఫ్రాడ్ కేసు పెట్టాలి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కాకుండా ఇలా పలుకుబడి గల వ్యక్తులకు ప్రధానమైన చోట్ల పాట్లు ఎలా వచ్చాయి? ఇది రైతులకు అన్యాయం చేయడం కాదా? ఈ మోసం ఇంతటితో ఆగలేదు. రాజధాని ఎక్కడ వస్తుందో చంద్రబాబుకే తెలుసు. కానీ నాటకాలాడారు. అమరావతి ప్రాంతంలో రైతులు తక్కువ రేటుకు భూములు అమ్ముకుని నష్టపోయారు. తన బినామీలందరికీ చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే జోనింగ్ పద్ధతి కింద రైతుల భూములు అగ్రిజోన్‌లో, బినామీల భూములను మాత్రం రియల్ ఎస్టేట్ జోన్‌లో వచ్చేలా చేశారు. ఈ ప్రాంతంలో రైతులకు చంద్రబాబు మేలు చేశారో, చెడు చేశారో ఆలోచించాలి.
రైతులు ఆనందంతో భోజనం పెడుతున్నారట
ఈరోజు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అసెంబ్లీలో నావద్దకు వచ్చారు. తమ ప్రాంతంలో అసెంబ్లీ ప్రారంభమైన సందర్భంగా ఆనందంతో ఇక్కడి రైతులంతా భోజనాలు పెడుతున్నారన్నారు. అందులో తానూ భాగస్వామిని కనుక విందుకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. శ్రావణ్‌కుమార్ చెప్పిన మాటలు చూస్తే అన్యాయం అనిపించింది. ఇవన్నీ తాత్కాలికమైన భవనాలే... శాశ్వత సచివాలయం గాని, శాశ్వత అసెంబ్లీ గాని ఎక్కడ వస్తుందో ఒక్క చంద్రబాబుకు తప్ప ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. శాశ్వత భవనం నిర్మాణం ఎంపిక జరిగాక ఇక్కడున్న తాత్కాలిక భవనాలు ఏ హెరిటేజ్ కంపెనీకో... లేదా ఎలాంటి పనీ లేని అప్రాధాన్య శాఖలకో కేటాయిస్తారు. అసెంబ్లీ పక్కన గాని, సచివాలయం పక్కన గాని రైతుల భూములు ఉంటే రేట్లు పెరుగుతాయి. అసెంబ్లీ, సచివాలయ శాశ్వత భవనాలు ఎక్కడ వస్తాయో తెలియని రైతులు ఆనందంగా భోజనాలు పెడుతున్నారు. రైతుల్ని ఇంత దారుణంగా మోసం చేయటం ధర్మమేనా?
మూడేళ్లయినా ఒక్క ఇటుక వేయలేదు
టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా శాశ్వత సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. అసలు అవెక్కడ వస్తాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియనే తెలియదు. చంద్రబాబు ఏ సిన్మాకు వెళితే ఆ సెట్టింగ్‌లాగా నిర్మాణం ఉంటుందని చెబుతారు. ఏ దేశానికి వెళితే ఆ దేశం లాగా రాజధాని నిర్మిస్తానని అంటారు. తాత్కాలిక సచివాలయానికి అతిగా ఖర్చు చేశారు. మా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ల లో చదరపు అడుగు ధర రూ 1500 ఉందన్నారు. కానీ బాబు 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కోసం రూ 650 కోట్లు వ్యయం చేశారు. అంటే చదరపు అడుగు ధర రూ 10,000గా ఉంది. తాత్కాలిక భవనానికి ఇంత ఖర్చు చేయడం అవసరమా?
గజరాజు పోతూంటే కుక్కలు మొరుగుతాయ్
టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దారుణంగా దుర్భాషలాడారని మీరే చెబుతున్నారు. మాట్లాడిన తీరును బట్టి ప్రభాకర్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. గజరాజు పోతూంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ ఈ విషయంపై నేనింతకంటే ఏమీ చెప్పను’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపులో తీరని అన్యాయం
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో తీరని అన్యాయం చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో చేస్తున్నట్లు చెబుతున్నారు గానీ అదో పెద్ద కుంభకోణంలా ఉంది. చంద్రబాబు మనుషులకు, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రధానమైన, బ్రహ్మాండమైన ప్రదేశాల్లో ప్లాట్ల కేటాయింపు జరిగింది. వీరందరికీ మంచి పార్కులు, ప్రధాన కూడళ్ల దగ్గర, వాణిజ్య వ్యాపార సముదాయాలు రాగల చోట్ల ప్రధాన రోడ్లకు పక్కన కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కోడెల శివప్రసాదరావు పీఏ గుత్తా లలిత్ కుమార్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుమారుడు వెంకట కృష్ణ కిశోర్‌రెడ్డి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కుమార్తె గులగొట్ల లక్ష్మీసౌజన్య వంటి వారికి అనేక ప్లాట్లు ఇలా ప్రధానమైన ప్రదేశాల్లో వచ్చాయి. లాటరీ పద్థతిలోనే కేటాయింపులు జరిగినట్లయితే మంత్రులకు, నాయకులకు అలాంటి ప్రదేశాల్లో ప్లాట్లు ఎలా దక్కుతాయి?