సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభంలో భాగంగా ఈనెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్పలు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘నవరత్నాల్లో అతిముఖ్యమైన అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయి. హైపవర్ కమిటీలో దీనిపై చర్చిస్తాము. కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నాం. వచ్చే బడ్జెట్‌లో దీనిని ప్రకటిస్తాం. అదానీ సంస్థ విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. వాళ్లు 400 ఎకరాలు అడగలేదు. రూ. 79 వేల కోట్ల పెట్టుబడులు అన్నదానిలో వాస్తవం లేదు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల పెట్టుబడితో వారు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు హయాంలో విశాఖ పారిశ్రామిక సదస్సుల ద్వారా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు. కానీ అందులో పది శాతం కూడా పెట్టుబడులు రాలేదు. సౌదీ అరేబియా నుంచి రూ. 3 వేల కోట్ల పెట్టుబడులతో నాలుగు కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి’అని మంత్రులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment