రాష్ట్రానికి అండగా నిలవండి | YS Jagan Mohan Reddy Meeting With President and Vice President | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి అండగా నిలవండి

Published Thu, Aug 8 2019 4:43 AM | Last Updated on Thu, Aug 8 2019 11:32 AM

YS Jagan Mohan Reddy Meeting With President and Vice President - Sakshi

బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి జగన్‌ రెండో రోజు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతో సమావేశమై రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు. ఉదయం 9 గంటలకు ఉప రాష్ట్రపతిని, 10.30 గంటలకు  రాష్ట్రపతిని కలుసుకున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.30 నుంచి గంట పాటు నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో హోంమంత్రి అమిత్‌  షాను కలిశారు. 11 గంటల వరకు దాదాపు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది.

హామీలను నెరవేర్చాలని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని అమిత్‌షాను అభ్యర్థించారు. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించిన ముఖ్యమంత్రి ఆయా కార్యక్రమాలకు సాయం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త రహదారుల నిర్మాణం, నిర్వహణకు చేయూతనివ్వాలని, అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని నితిన్‌ గడ్కరీని కోరారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, రఘురామకృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్‌ బీశెట్టి వెంకట సత్యవతి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులున్నారు.

అమిత్‌ షాతో గంటపాటు వైఎస్‌ జగన్‌ భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు సమావేశమయ్యారు. అమిత్‌ షాను మంగళవారం మధ్యాహ్నమే కలవాల్సి ఉన్నా పార్లమెంట్‌లో జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కారణంగా వీలు పడలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. విభజన హామీల అమలుకు హోంశాఖ నోడల్‌ వ్యవస్థగా ఉన్నందున విభజన హామీలన్నీ అమలయ్యేలా చూడాలని హోం మంత్రికి విన్నవించారు. 

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి పూర్తి గ్రాంటు ఇవ్వాలి
రాష్ట్రంలో పలు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరిన ముఖ్యమంత్రి జగన్‌ ఆ వివరాలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి అందజేశారు. రహదారుల నిర్వహణ, నిర్మాణం కోసం గ్రాంట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కోరారు. తీవ్ర ఆర్ధిక కష్టాలతో ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంతో అవసరమని నివేదించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల అంశాన్ని కూడా గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి  తెచ్చారు. 

నవరత్నాలకు సాయం అందించండి...
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ‘నవరత్నాలు’ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, దీనికి తగిన రీతిలో సాయం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ప్రతిపాదిత వాటర్‌ గ్రిడ్‌కు తగినన్ని నిధులు మంజూరు చేయాలని, రెవెన్యూ లోటు కూడా భర్తీ చేయాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాల్సి ఉందని, దీనికోసం ఇప్పటివరకు  చేసిన వ్యయాన్ని చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని సకాలంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా సముచిత రీతిలో సాయం చేయాలని ముఖ్యమంత్రి విన్నవించారు.  

ఆర్థిక మంత్రికి విన్నపాలు ఇవీ..
- రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. 2014–15లో రూ. 97 వేల కోట్లుగా ఉన్న అప్పులు ఐదేళ్లలో రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. వెనుకబడ్డ జిల్లాల కోసం ఆరేళ్లలో రూ. 2,100 కోట్లు రావాల్సి ఉండగా రూ. 1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. కేబీకే ప్యాకేజీ తరహాలో కేంద్రం నుంచి గ్రాంట్లు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలి.
ఏపీలో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీటి సరఫరా పథకానికి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుంది. కేంద్రం తగిన రీతిలో దీనికి సహాయం అందించాలి.
రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రత్యేక హోదా అత్యంత అవసరం. ఏపీకి పారిశ్రామిక రాయితీలు, పదేళ్లపాటు జీఎస్టీ, ఆదాయపుపన్ను నుంచి మినహాయింపులు కల్పించాలి. 
పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలో ప్రతి రైతుకుటుంబానికి వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున అందజేస్తాం. 16 లక్షల మంది కౌలు రైతులకూ వర్తింపజేసే ఈ పథకానికి కేంద్రం తగిన విధంగా సహాయం చేయాలి. అన్నదాతలను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ. 2 వేల కోట్లు కేటాయించాం. 
​​​​​​​- అమ్మఒడి, 40 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రతి పేద విద్యార్థికీ ఏటా రూ. 20 వేల చొప్పున బోర్డింగ్, హాస్టల్‌  ఖర్చుల కింద పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటికి కేంద్రం తగిన సహాయం చేయాలి. 
​​​​​​​- రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా పథకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌ దిశగా ప్రయాణం ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
​​​​​​​- రాష్ట్రంలో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేస్తాం. ఇందుకు కేంద్రం కూడా సహాయం అందించాలి. 
​​​​​​​- రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల అప్పులు గత నాలుగేళ్లలో రూ. 14 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్లకు చేరాయి. వడ్డీ బరువు మోయలేక, రుణాలు చెల్లించలేక అక్కచెల్లెమ్మలు అల్లాడుతున్నారు. వైఎస్సార్‌ ఆసరా కింద నాలుగు విడతల్లో వారి చేతికే డబ్బులు ఇస్తాం. దీనిద్వారా దాదాపు 89 లక్షల మంది రుణ విముక్తులవుతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లపాటు ఏడాదికి రూ. 19 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. దీనికి తగిన రీతిలో కేంద్రం సాయం అందించాలి.
​​​​​​​- వీటితోపాటు ప్రధానికి ఇప్పటికే అందజేసిన వినతిపత్రంలోని మరికొన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి తాజాగా అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. 

రాష్ట్రపతితో సీఎం జగన్‌ సమావేశం
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రపతిని కలవడం ఇదే తొలిసారి. ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు సాగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఉప రాష్ట్రపతితోనూ భేటీ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం భేటీ అయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు సీఎంతో పాటు ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ సమావేశం అనంతరం ఉప రాష్ట్రపతి ట్వీట్‌ చేస్తూ ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ఉదయం నన్ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించాం. ఏపీ సమగ్రాభివృద్ధికి మనం ఉమ్మడి కృషి చేయాలని ఆయనతో చెప్పాను. తెలుగు ప్రజలు ఏ సాయం కోరినా చేసేందుకు సంతోషిస్తాను’ అని పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన పొడిగింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement