సుఖసంతోషాలు వెల్లివిరియాలి
రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రభుత్వాలు హామీలను నెరవేర్చి ప్రజలకు మేలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2015 చిరస్మరణీయమైన సంవత్సరం కావాలని, కొత్త ఏడాదిలో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు.
బుధవారం ఆయన ఇరు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా శ్రేయస్సుకు సంబంధించి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కోరారు. పేదల సంక్షేమంపై ఇచ్చిన ప్రతి హామీని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిలబెట్టుకొని, 2015లో ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు.
చిరంజీవి, జయప్రకాష్ నారాయణ..
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. చిరంజీవి, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తె లిపారు.
తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు: ఏపీ మంత్రి సునీత
రాష్ట్ర ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మంత్రి సునీత సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం కేక్ కట్ చేసి సిబ్బందితో వేడుకలు జరుపుకున్నారు.
రైతులు, బలహీన వర్గాలకు మంచి జరగాలి
రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో రైతులు, దళితులు, బలహీనవర్గాలకు మంచి జరగాలని, వారి జీవితాల్లో ఆశించిన మార్పు రావాలని కోరారు.