మీరే సీఎంగా వస్తారు.. | Ys jagan mohan reddy praja sankalpa yatra in vizianagaram district | Sakshi
Sakshi News home page

మీరే సీఎంగా వస్తారు..

Published Fri, Oct 5 2018 3:11 AM | Last Updated on Fri, Oct 5 2018 4:56 AM

Ys jagan mohan reddy praja sankalpa yatra in vizianagaram district - Sakshi

మూలస్టేషన్‌ రోడ్‌లో జన సందోహం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘మీరు గెలుస్తారంతే.. అలగలగ సూడండి బాబూ.. పేదోళ్లు ఎంత అల్లాడిపోతన్నరో.. సెంద్రబాబు ఏటి సేసినాడయ్యా.. మా బతుకులు బుగ్గి సేత్తన్నాడు.. ఏటి మరి.. పేదోడికేదీ రావడం లేదు.. రేషన్‌కార్డు అడిగినా జన్మభూమి కమిటీవోళ్లు డబ్బులియ్య మంటన్నారయ్యా.. ఇల్లులేదు.. పించన్లు లేవు.. ఎలగ బతకాలయ్యా మేము.. యక్కడికెళ్తాం.. ఏం సేత్తాం మరి.. ఈ సెంద్రబాబును మరింక రానియ్యం’ అని ఉత్తరాంధ్ర మాండలికంలో జనం నుంచి ఉద్విగ్న భరితంగా వచ్చిన మాటలివి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 278వ రోజు గురువారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి ప్రారంభమైంది.

మొయిద క్రాస్‌ మీదుగా మూల స్టేషన్‌ వరకు సాగిన యాత్రలో అనేక మంది జగన్‌తో కలిసి నడిచారు. కష్టాలు చెప్పుకున్నారు. సలహాలిచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. హారతులు పట్టారు. అభిమానం పంచారు. దినసరి కూలీల నివాసాల మధ్య నుంచే పాదయాత్ర సాగింది. రోడ్డు పక్కనే గుడిసెలేసుకున్న పేదలు తమకు సమీపం నుంచే జగన్‌ వెళ్తుండటాన్ని అపురూపమైన జ్ఞాపకంగా చెప్పుకున్నారు. ఆ ప్రాంత వాసులు జగన్‌ బస చేసిన శిబిరం వద్దకే వెళ్లి స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. ఇంటిల్లిపాది పాదయాత్రలో పాల్గొనడం విశేషం.

దారిపొడవునా ప్రతి ఒక్కరినీ కలుస్తున్న జగన్‌కు ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో వాళ్లే స్వచ్ఛందంగా క్యూ కట్టారు. ప్రతి ఇంటి ముందూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా.. గుమ్మం ముందు ఎవరో ఒకరు నవ్వుతూ ‘అన్నా...’ అంటూ పిలిచే పిలుపులు.. వేచి చూస్తున్న గుంపులో ‘ఆయనొస్తాడు... మళ్లీ వాళ్ల నాన్న పాలనే వస్తుంది’ అనే చర్చ విన్పించింది. జననేతను కలిసి ప్రతి గుండె పులకించింది. సెల్ఫీ దిగితే దాన్నో అరుదైన అవకాశమొచ్చిందని ఉప్పొంగి పోవడం దారిపొడవునా కన్పించింది.

దళితుల గుండె మంట
‘అన్నొస్తున్నాడు.. మా దళితులకు మంచి రోజులొస్తాయి’ అని పెద తరిమి గ్రామ దళితులు ఆకాంక్షించారు. తెలుగుదేశం అరాచకాన్ని జననేతతో చెప్పుకునేందుకు వాళ్లొచ్చారు. అప్పుడు వాళ్ల కళ్లు ఎర్రబడి ఉన్నాయి. మాటలు తూటాల్లా దూసుకొచ్చాయి. ఆవేదన గుండెలను తన్నుకొచ్చింది. ‘ఇదెక్కడి ప్రభుత్వమయ్యా.. మాకు ఎప్పుడో ఇచ్చిన 33 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. అధికార పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. భూముల్లో మొక్కలు నాటి మమ్మల్ని తరిమేస్తున్నారు.

కోర్టుకెళ్లినా దౌర్జన్యం చేస్తున్నారు. ఇక మాకు జగనన్నే అండ. అందుకే వచ్చాం. ఆయనొస్తాడు. మాకు మేలు చేస్తాడు’ అని అప్పారావు, రాజశేఖర్‌తో పాటు మరికొంత మంది అన్నారు. జగన్‌ను కలిసిన తర్వాత తమకు కొండంత ధైర్యమొచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే... పాకీపేటగా పిలిచే ఎంపీనార్త్‌ గ్రామం నెల్లిమర్లకు పక్కనే ఉంది. అక్కడున్న 20 దళిత కుటుంబాల వాళ్లలో ఎవరిని కదిపినా కన్నీటి గాధే. దశాబ్దాలుగా ఉంటున్నా వాళ్ల ఇళ్లకు పట్టాలు ఇవ్వడం లేదట.

ఎన్నిసార్లు జన్మభూమి కమిటీలో దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేదన్నారు. అధికారులు విసుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందడం లేదని చెప్పారు. వైఎస్‌ పాలనలో దక్కిన గౌరవం, ఆదరణను గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఆ మంచి రోజులు మీరొస్తేనే వస్తాయన్నా.. అంటూ జననేత ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. తైక్వాండో అకాడమి కోచ్‌ డాక్టర్‌ భరిడే సుమన్‌శ్రీనివాస్‌.. ఎంపీ అశోకగజపతి రాజు దౌర్జన్యకాండను జగన్‌ వద్ద ఆవేశపూరితంగా చెప్పాడు. మీరు అధికారంలోకొస్తేనే మంచి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.  

రాక్షస పాలనలో వ్యథా భరితుల ఆవేదనలు..
దారిపొడవునా ఎన్నో అర్జీలు.. ఇంకెన్నో వేదనలు.. వ్యథాభరిత హృదయ ఘోష. చంద్రబాబు రాక్షస పాలనలో నలిగిపోయిన, నలిగిపోతున్న వాళ్లే. వాళ్లంతా జగన్‌ రావాలని, వస్తేనే కష్టాలు తీరతాయని భావించారు. దమరసింగికి చెందిన మీసాల రామునాయుడు బాధ అంతా ఇంతా కాదు. తమ్ముడితో సహా అతనూ పుట్టు వికలాంగులట. సర్కారు ఆదుకుంటుందని తిరిగి తిరిగి విసుగొచ్చిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభిమాని అనే సాకుతో సంక్షేమ పథకాలు ఇవ్వమంటున్నారని జగన్‌ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. హుద్‌హుద్‌ తుపానుతో ఇళ్లు నేలమట్టమైతే ఈవాళ్టికీ ఈ సర్కారు ఆదుకోలేందంటూ దారిపొడవునా పేదలు చంద్రబాబు పాలనపై దుమ్మెత్తి పోశారు.

‘అన్నా.. మీరొచ్చి ఆదుకోవాలి’ అంటూ జగన్‌ను వేడుకున్నారు. గిరిజన నిరుద్యోగులకూ జగనే ఆశాదీపంగా మారారు. గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌ పేట నుంచి వచ్చిన మైదాన ప్రాంత గిరిజన నిరుద్యోగ సంఘం జగన్‌ను కలిసింది. బాబు పాలనలో ఏ ఒక్క నోటిఫికేషన్‌ రాలేదని, చదవుకున్న యువత ఉపాధి లేక అలమటిస్తోందని చెప్పారు. ‘మీరు ప్రకటిస్తున్న నవరత్నాలు విన్నాక భవిష్యత్‌పై ఆశ కలుగుతోందన్నా.. ఎస్టీల బతుకులు మారతాయన్న నమ్మకం కలిగిందన్నా..’ అంటూ రఘుపతుల శశిభూషణ్‌ అన్నారు. అందరి కష్టాలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.


చంద్రబాబు.. కళాకారుల కడుపుకొట్టారు
అన్నా.. మాది ఎస్‌.కోట మండలం ధర్మవరం. కళాకారుల సంక్షేమాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం పక్కన పెట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మా కళాకారులకు ఉపాధి కల్పించడానికి నెలలో 15 రోజుల పని అప్పజెప్పారు. మేము ఊరూరూ తిరిగి ఆరోగ్య సూత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి బుర్రకథ రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉపాధిని కోల్పోయాం. జిల్లాలో 2 వేల మంది కళాకారులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సంపాదించింది చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడు పని కూడా లేదు. ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి స్థలం కూడా లేదు. మా సమస్యలన్నీ జగన్‌ గారికి వివరించాం. ఆయన భరోసా ఇచ్చారు.     – నక్కాన వెంకటరమణ, శ్రీలక్ష్మి.

మా భూములు ఆక్రమించుకుని మాపైనే కేసులా?
అయ్యా.. మాది పెద్దతరిమి గ్రామం. ప్రభుత్వం 1992లో దళితులకు 33 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఆ భూమిని అప్పటి నుంచి సాగు చేసుకుంటు వస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సువ్వాడ రవిశేఖర్, సువ్వాడ వనజాక్షి అనేవారు  అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని భయపెడుతున్నారు. వీరికి ప్రభుత్వ పెద్దలు అండగా ఉన్నారు. పోలీసుస్టేషన్‌కు పిలిపించి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కోర్టు తీర్పును కూడా కాదని వారు దౌర్జన్యంగా మా భూముల్లో మొక్కలు నాటుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. మీరే న్యాయం చేయాలి.   – దేబారికి అప్పారావు

తైక్వాండో అకాడమీని కూలదోశారు  
సార్‌.. మాజీ ఎంపీ ఆనందగజపతిరాజు సూచనలతో వరల్డ్‌ తైక్వాండో ఫెడరేషన్‌ను మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఆయన మృతి చెందిన వెంటనే ఇప్పటి ఎంపీ అశోక్‌ గజపతి రాజు దానిని కూలదోసి కోచ్‌గా ఉన్న నా పోస్టును రద్దు చేశారు. ఆనంద గజపతిరాజు ఈ స్కూల్‌ను ప్రభుత్వంలో విలీనం చేయాలని భావించేవారు. ఆయన సూచనలతోనే తైక్వాండో ఆకాడమిలో ఇప్పటి వరకు 18,790 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం.

దీని వల్ల రిజర్వేషన్లు పొంది చాలా మంది విద్యార్థులు పోలీసు, నేవీ, మిలటరీలో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలోని విద్యాలయాలు వ్యాపార ధోరణిలో నడుస్తున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఎనిమిది సార్లు, సీఎంకు మూడు సార్లు, పాఠశాల విద్య జేడీకి ఓ సారి ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు లేవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఈ విద్యాలయాలను ప్రభుత్వ పరం చేయండి.  
 – డాక్టర్‌ భరిడే సుమన్‌ శ్రీనివాస్, డాక్టర్‌ పీవీజీ రాజు స్కూల్‌ ఆఫ్‌ తైక్వాండో అకాడమి కోచ్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement