సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో బ్రాహ్మణ సంఘాలతో వైఎస్ జగన్ సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో బ్రాహ్మణులు పేదరికంలో అల్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ కుటుంబ పోషణకు ముఖ్యమైన అర్చకత్వాన్ని నేడు ఎందుకు చేస్తున్నామా అని బ్రాహ్మణులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. నేడు ఆ వృత్తి కనీసం కడుపుకి భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉందన్నారు. బ్రాహ్మణులంటే.. ప్రజలకు దేవుడికి మధ్య వారధిలాంటి వారని వైఎస్ జగన్ అభివర్ణించారు. అలాంటి వారు నేడు చంద్రబాబు పాలన దీనస్థితిలో ఉన్నారని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలను ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
‘‘గత ఎన్నికల సమయంలో ప్రతి పేద బ్రాహ్మణులకు చంద్రబాబు ఐదు వేలు ఆర్థిక సహయం చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల గడిచినా ఇంతవరకూ ఆ హామీని అమలు చేయలేకపోయారు. గతంలో చంద్రబాబు పూజారులకు పదవీ విరమణ వయసు లేకుండా చేస్తామన్నారు. కానీ రమణ దీక్షితుల్ని అన్యాయంగా పదవి నుంచి తొలగించి ఇంటికి పంపించారు. నామినేటెడ్ పోస్టుల్లో బ్రాహ్మణులు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. బ్రాహ్మణులకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. దేవాదాయ ఆస్తులను పరిరక్షిస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోని నేతలు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను దోచుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన కోట్లు విలువ చేసే పదకొండువందల ఎకరాల భూమిని సిద్ధార్ధ అనే ప్రైవేటు కాలేజీకి కేవలం లక్ష రూపాయాలకే కట్టబెట్టారు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘సదావర్తి భూములను కూడా తక్కువ రేట్లకు చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ పోరాటం చేసి ఆ భూములను కాపాడింది. బ్రాహ్మణలను ఆదుకునేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఏటా వందకోట్లు చొప్పున రూ. 500 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు గతంలో అన్నారు. కానీ నాలుగేళ్ల కాలంలో కేవలం రూ. 164 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దేవుడి ముందు కూడా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు మాత్రమే. గుడిని, గుడిలోని లింగాన్నీ దోచుకునే వ్యక్తి చంద్రబాబు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘పుష్కరాలు పేరుతో ఏకంగా రూ. 3200 కోట్లు దోచుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారు. గుడిలో దోచుకోవడానకి ఏ ఒక్క అవకాశం ఉన్నా దానికి చంద్రబాబు వదిలిపెట్టడం లేదు. గుడుల్లో క్లీనింగ్ చేసే పనుల కాంట్రాక్టు ఏడు లక్షలు ఉండేది.. కానీ భాస్కర్ నాయుడు అనే వారి బంధువుకి ఏకంగా 32 లక్షలకు కాంట్రాక్టు కట్టబెట్టారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment