
సాక్షి, విశాఖ : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా ధారభోగాపురంలోని పాదయాత్ర శిబిరం వద్ద జననేత వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు పలువురు మహిళా నేతలు ఆదివారం ఉదయం రాఖీలు కట్టారు. ఆయనకు మిఠాయిలు తినిపించి.. ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగనన్నకు రాఖీ కట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటోందని ఆమె పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకంతో రాష్ట్రంలోని అందరికీ మేలు జరుగుతుందని రోజా తెలిపారు. వైఎస్ జగన్ మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 246వ రోజు పాదయాత్రను ధారభోగాపురం నుంచి ప్రారంభిచారు. అక్కడి నుంచి వెంకటాపురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ, అత్యూచాపురం మీదుగా రామన్నపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.