'బాబు పదేపదే టీవీల్లో కనిపించడానికే చూస్తున్నారు'
'బాబు పదేపదే టీవీల్లో కనిపించడానికే చూస్తున్నారు'
Published Thu, Oct 16 2014 7:24 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
విశాఖ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం విశాఖలోని ఏకేసీ, ఏఎస్సీసీ కాలనీల్లో హుదూద్ తుపాన్ బాధితుల్ని పరామర్శించిన జగన్.. చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పదే పదే టీవీల్లో కనిపించడానికే పరిమితం అవుతున్నారని విమర్శించారు. బాధితులకు ఏమీ చేయకుండా ఏదో చేసినట్లు కలర్ పూసి మాయ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. తమ వద్దకు ఎవరూ రాలేదని తుపాను బాధితులు ఏకరువు పెట్టడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపొట్లాలను పంచే క్రమంలో బాధితులంతా లారీ దగ్గరకు వెళితే.. ఆ పొట్లాలను విసిరివేయడాన్ని తప్పుబట్టారు. అసలు బాధితులను ఆదుకోవాలంటే ఎంతైనా చేయొచ్చని జగన్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లతో నడుస్తున్నప్పుడు తుపాను బాధితులపై శ్రద్ద వహించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇళ్లు పైకప్పులన్నీ ఎగిరిపోయి నిరాశ్రయులగా ఉన్న తమ వద్దకు ఎవరూ రాలేదని బాధితుల గోడు వెళ్లబోసుకున్నారని జగన్ పేర్కొన్నారు. బాధితులకు నిజంగా చేయాలనే ఉద్దేశం ఎవ్వరికీ కనిపించడం లేదన్నారు.తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి పూర్తి స్థాయి పరిహారం అందజేయాలని.. అప్పటివరకూ తమ పోరాటాన్ని విశ్రమించమని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement