భవిష్యత్తుపై.. భరోసాతో..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎఎస్.జగన్‌మోహన్ రెడ్డి కార్యరంగంలోకి దిగారు. అలాగే అదే సమయంలో పార్టీ నేతలు, కేడర్‌కు భవిష్యత్‌పై భరోసా కల్పించే దిశగా...ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములపై ఆ పార్టీ లోతుగా విశ్లేషణ చేస్తోంది. అదే సమయంలో పార్టీ పటిష్టతకు భవిష్యత్ ప్రణాళికను తయారు చేస్తోంది. ఎన్నికల ఫలితాలపై గత నెల 31వ తేదీన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సమీక్ష జరగ్గా, ఈనెల 5వ తేదీన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షకు సిద్ధమవుతోంది. రాజమండ్రిలో జరిగే సమీక్షకు హాజరయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా సన్నద్ధమయ్యారు.
గెలుపోటములకు గల కారణాలపై నివేదికలు తయారు చేసుకుని హాజరై అధినేత సమక్షంలో చర్చించనున్నారు. జిల్లా స్థాయిలో సమీక్ష చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులిచ్చిన నివేదికలను, అభ్యర్థులిచ్చిన నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ పార్టీ అధ్యక్షుడు రూపొందించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2.30గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి సుమారు మూడున్నర గంటల పాటు క్షుణ్ణంగా సమీక్షించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా సమావేశమై నేతల నివేదికలను పరిశీలించనున్నారు. ఏడు నియోజకవర్గాల నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడి గెలుపోటముల కారణాలను తెలుసుకోనున్నారు. ప్రచార తీరు, ఎన్నికల వ్యూహాలు, వెన్నుపోట్లుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
వ్యూహాల్లో ఎక్కడెక్కడ వెనకబడ్డాం, ఏయే విషయాల్లో విఫలమయ్యాం, అందుకు గల కారణాలు, ప్రత్యర్థులు గెలుపునకు దోహదం చేసిన అంశాలపై విశ్లేషించనున్నారు. ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిన పార్టీ నిర్మాణంపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. సరైన కేడర్ లేకపోవడం వల్లనే చాలాచోట్ల పార్టీ దెబ్బతిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రపైనా చర్చించనున్నారు. భవిష్యత్‌లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఏ విధంగా పోరాటం చేయాలి అనే అంశాలపైనే చర్చ జరగొచ్చని తెలుస్తోంది. స్పష్టమైన విధివిధానాలతో పార్టీ దశ దిశ నిర్దేశించనున్నారు. భవిష్యత్ కర్తవ్యాన్ని పార్టీ నేతలకు, కేడర్‌కు తెలియజేసి వారిలో ఆత్మస్థైర్యం కలిగించనున్నారు.