జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
- జిల్లాలో 14 స్థానాలు గెలుస్తాం
- 3 ఎంపీ స్థానాలు మావే
- కేంద్రంలోనూ జగన్ గాలి
- పెద్దిరెడ్డి ధీమా
పుంగనూరు, న్యూస్‌లైన్: ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కుప్పంలో సైతం వైఎస్సార్‌సీపీ విజయం సాధించి జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ స్థానంలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని, కేంద్రంలో సైతం జగన్ హవా కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఆయన పుంగనూరులో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు డాక్టర్లు శివ, ప్రభాకర్‌తోపాటు పలువురు నేతలతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రజలు వైఎస్.రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునేందుకు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని, జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో అభిమానంతో జగన్‌కు ఓట్లు వేశారన్నారు.
జగన్ నేతృత్వంలో రాజన్న సంక్షేమ పథకాలు రాష్ర్టంలో అమలవుతాయన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని చాటుకున్నారని, ఈ పోలింగ్ సరళి ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తోందని చెప్పారు. నాలుగేళ్ల పాటు ప్రజలు అండగా నిలిచి ఆదరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహాసంగ్రామం పూర్తయిందని, వైఎస్సార్‌సీపీ విజయ బావుటా ఎగురవేయడమే మిగిలి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, కొండవీటి నరేష్, సికె. శ్రీనివాసులు, రాజేష్, ఆటో సురేష్ తదితరులు పాల్గొన్నారు.