సాక్షి, తూర్పుగోదావరి: ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారని, ప్రతి అంశంలో తొందరపాటు కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. కేబినెట్ మీటింగ్‌లో ఈసీ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాడానికి అవకాశం లేదని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు అసలు కార్యరూపం తీసుకువచ్చింది దివంగత వైఎస్సార్ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు జీవనాడైన పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు కాసుల కక్కుర్తే కారణమన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటైన వెంటనే పోలవరాన్ని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
పర్యవరణ, ఇతర అనుమతులను వైఎస్సార్ హయాంలోనే 4500 కోట్లు ఖర్చు చేశారని, 2019 కల్లా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని మర్చిపోయారని మండిపడ్డారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పట్టిసీమను నిర్మించారని బొత్స ఆరోపించారు. పోలవరం అంచనాల వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి 55వేల కోట్లకు పెంచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2019లో గ్రావిటీ ద్వారా నీరందిస్తామని తప్పుడు మాటలు చెప్పి.. ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు 2020 వరకు నీరు ఇవ్వడం సాధ్యంకాదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment