
సాక్షి, రాజమహేంద్రవరం: ఓ వైపు భానుడి ఉష్ణోగ్రతలు, మరో వైపు ఉక్కపోత, మంచినీరు తాగినా నిమిషాల్లో చెమటగా వెళ్లిపోతున్నా లెక్కచేయలేదు. తమ అభిమాన నాయకుడు, రాజన్న బిడ్డను చూడాలంటూ చేబ్రోలు పోటెత్తింది. తమ తోబుట్టువును చూడాలని చంటి బడ్డలతో అక్కాచెల్లెమ్మలు, తమ మనవడిని పలకరించాలని ఊత కర్రతో అడుగులో అడుగేసుకుంటూ అవ్వాతాతలు, తమ అభిమాన నాయకుడి ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం యువత చేబ్రోలు రోడ్లపై వరుసకట్టింది. ఉదయం నుంచి ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడన్న మాటలు వింటూ రోడ్ల వెంబడి గంటల తరబడి ఎదురు చూశారు. తమ రాజన్న బిడ్డను చూశామన్న ఆనందంతో వారంతా చిన్నపిల్లల్లా మురిసిపోయారు. సామాన్యులు చెప్పుకున్న సమస్యలను జగన్ సావధానంగా విన్నారు. తానున్నానని వారికి భరోసా కల్పించారు. మరి కొద్ది రోజులు ఓపిక పట్టండంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగారు.
కష్టాలు, సమస్యలు చెప్పుకున్న ఆపన్నులు
కష్టాలు తీర్చే చల్లనయ్య వచ్చాడంటూ వివిధ వర్గాల ప్రజలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ బాధలు, సమస్యలను జగన్‌కు చెప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని కాపాడాలని గొల్లప్రోలుకు చెందిన చేనేత కార్మికులు బండారు బాబూరావు, పలకా సుబ్బారావులు విన్నవించారు. వైఎస్సార్ హయాంలో జిల్లాలో 50 సంఘాలు ఉండగా ప్రస్తుతం 8 మాత్రమే ఉన్నాయని తమ దుస్థితిని వివరించారు. చదువుకున్న దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని మేడిశెట్టి నాగమణి విజ్ఞప్తి చేసింది. ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న తమకు ఏదైనా ఆధారం చూపించాలని పెంకే రాంబాబు, రమాదేవి దంపతులు కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పార్ట్‌టైం టీచర్స్ వినతిపత్రం విచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు రక్షణ కల్పించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విద్యార్థులు మానస, దేవి, పద్మ, దుర్గాభవాని వినతి పత్రం ఇచ్చారు. అందరి సమస్యలు, కష్టాలు విన్న జగన్ పరిష్కారంపై స్పష్టమైన భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
పాదయాత్రలో పార్టీ శ్రేణులు..
పాదయాత్రలో శనివారం పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మళ్ల విజయప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు అనంత ఉదయ్‌భాస్కర్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, బుర్రా అనుబాబు, రావి చిన్నారావు, వెంగలి సుబ్బారావు, మాదిరెడ్డి దొరబాబు, చింతపల్లి ఏసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేబ్రోలు మురిసింది
ప్రజా సంకల్ప పాదయాత్ర 228వ రోజు శనివారం చెందుర్తి క్రాస్ నుంచి మొదలై చేబ్రోలు గ్రామం మీదుగా దుర్గాడ క్రాస్ వరకు సాగింది. రాత్రి బస కేంద్రం వద్ద ఉదయం నుంచే తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, అక్కచెల్లెమ్మలను పలకరించిన జగన్ పాదయాత్ర ప్రారంభించారు. మరో రెండు అడుగులు వేయగానే పలువురు తమ సమస్యలను చెప్పుకున్నారు. చేబ్రోలు గ్రామంలోకి అడుగుపెట్టగానే వారు హారతులు పట్టి స్వాగతం పలికారు. రామాలయం సెంటర్ వద్దకు చేరుకునేందుకు మధ్యాహ్నం 12 గంటలు పట్టింది. అక్కడ భోజన విరామం అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలైంది. చిన్నారులు, యువత, అభిమానులు సెల్ఫీల కోసం ఉవ్విళ్లూరారు.
వివిధ వర్గాల వినతులు, ఆపన్నుల ఆరోగ్య బాధలు వింటూ పలు సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ, భవితపై భరోసా ఇస్తూ జగన్ 216వ నంబర్ జాతీయ రహదారిపైకి అడుగుపెట్టారు. గ్రామం చివరన జాతీయ రహదారి పక్కన ఉన్న ఆదర్శ కాలేజీ విద్యార్థులు రెడ్ కార్పెట్‌తో జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ రంగులతో కూడిన బెలూన్లు ఎగరవేసి కేరింతలు కొట్టారు. భారీ ఎత్తున గాలిలో ఎగురుతున్న బెలూన్లు అందరినీ ఆకర్షించాయి. జగన్‌తో విద్యార్థులు సెల్ఫీలు దిగిన అనంతరం పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం 5:40 గంటలకు దుర్గాడ జంక్షన్‌లోని రాత్రి బస కేంద్రం వద్దకు చేరుకుంది. ఆదివారం పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. యాత్రలో భాగంగా సాయంత్రం కత్తిపూడిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
నలతగా ఉన్నా పాదయాత్రలోనే..
శనివారం ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉన్నా వైఎస్ జగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం పాదయాత్ర కొనసాగించారు. ఉదయం నుంచి స్పల్ప జ్వరం, డస్ట్ అలెర్జీ, జలుబు, దగ్గుతో బాధపడుతున్న జగన్ మండుటెండలోనూ పాదయాత్ర సాగించారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి కష్టాలు సావధానంగా విన్నారు. డస్ట్ అలెర్జీ ఇబ్బంది పెడుతున్నా మోములో దరహాసంతో అభిమానుల కోరిక మేరకు స్వయంగా సెల్ఫీలు తీసి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment