విధి నిర్వహణలో వివక్ష చూపొద్దు | YS Jagan Pay Tributes To Police Martyrs On Police Commemoration Day 2019 | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో వివక్ష చూపొద్దు

Published Tue, Oct 22 2019 3:11 AM | Last Updated on Tue, Oct 22 2019 12:58 PM

YS Jagan Pay Tributes To Police Martyrs On Police Commemoration Day 2019 - Sakshi

మన రాష్ట్ర భద్రత కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. అలాంటి అమరవీరులకు సగర్వంగా సెల్యూట్‌ చేస్తున్నా.. హోంగార్డ్‌ నుంచి డీజీపీ వరకు అందరి కష్టం నాకు తెలుసు. ఎండ, వాన, రాత్రి, పగలు అని చూడకుండా వారానికి ఒక్కరోజు కూడా సెలవు లేకుండా కష్టపడుతున్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్‌) ప్రకటించాం. 
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి :   చట్టం ఏ కొందరికో చుట్టం కాకూడదని, విధి నిర్వహణలో వివక్ష చూపొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు పిలుపునిచ్చారు. మెరుగైన పోలీస్‌ సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలంటే అందరికీ సమన్యాయం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఎవరికైనా ఒకే రూలు, ఒకే చట్టం అయినప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయని ప్రతి పోలీస్‌ సోదరుడికి, పోలీస్‌ అక్కచెల్లెమ్మలకు గుర్తు చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  

అమర వీరులందరికీ సెల్యూట్‌.. 
‘‘పోలీస్‌ అమర వీరుల కుటుంబాలకు, పోలీస్‌ శాఖలోని సిబ్బంది, అధికారులు, ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ రోజు పోలీస్‌ అమర వీరులను గుర్తు చేసుకునే రోజు. 1959లో చైనా సరిహద్దులో ఎస్‌ఐ కరణ్‌ సింగ్‌ నేతృత్వంలో గస్తీ నిర్వహిస్తున్న 20 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై వందల సంఖ్యలో చైనా సైనికులు విరుచుకుపడ్డారు. వీరున్నది 20 మందే అయినా వీరోచితంగా ఎదురు దాడి చేశారు. ఈ దాడిలో పది మంది పోలీసులు వీర మరణం పొందారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ దేశమంతా పోలీసుల అమర వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఇటువంటి ఘటనలు మన రాష్ట్రంలో కూడా అనేకం వున్నాయి. మన రాష్ట్ర భద్రత కోసం అనేక సందర్భాల్లో ఎందరో ప్రాణాలు అర్పించారు. అలాంటి అమర వీరులకు ఇక్కడి నుంచి సగర్వంగా సెల్యూట్‌ చేస్తున్నాను. పోలీస్‌ టోపీ మీద ఉన్న సింహాలు మన దేశ సార్వ¿ౌమాధికారానికి చిహ్నం. దానిని కాపాడే వారే పోలీసులు. అందుకే పోలీస్‌ స్టేషన్‌ను మనం రక్షకభట నిలయం అని పిలుస్తున్నాం.
 
ప్రజల హృదయాల్లో నిలవాలి  
మెరుగైన పోలీసు సేవలు అందించాలన్నా, ప్రజల హృదయాల్లో నిలవాలన్నా శాంతిభధ్రతల విషయంలో పోలీసులు రాజీ పడకూడదు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదని నా మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పాను. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పించడంలో ఏమరుపాటు వద్దని చెప్పాను. పౌరుల భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించాను. బడుగు, బలహీన వర్గాలు, పేదవారి మీద హింస జరుగుతుంటే.. కారకులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని చెప్పాను. న్యాయం, ధర్మం ఎవరికైనా ఒకే విధంగా ఉండాలి. చట్టం ఏ కొందరికో చుట్టం కానప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయి. న్యాయం కోసం వచి్చన పేదలు, బలహీనవర్గాల వారు కూడా వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళితేనే పోలీసులు ప్రజల మన్ననలు, గౌరవాన్ని పొందగలుగుతారు. పోలీసులు వారానికి ఒక రోజు వారి రోజువారీ బాధ్యతలను పక్కన పెట్టి కుటుంబంతో గడిపితే.. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అందుకే వారంతపు సెలవు ప్రకటిస్తూ మార్పునకు శ్రీకారం చుట్టాం. తద్వారా మెరుగైన పోలీస్‌ వ్యవస్థ వస్తుందనే విశ్వాసం నాకుంది.  

పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద అంజలి ఘటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

నివాళిలోనూ సీఎం నిబద్ధత.. 
పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించడంలో చూపిన నిబద్ధత అందరి ప్రశంసలందుకుంది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సీనియర్‌ ఐపీఎస్‌లు వెంట రాగా సీఎం వైఎస్‌ జగన్‌.. చెప్పులు పక్కన వదిలి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వివిధ వర్గాల ప్రముఖులు, అధికారులు సీఎం చర్యను అభినందిస్తూ పోస్టులు పెట్టారు.    

లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో ఎంతటివారైనా మినహాయింపు వుండకూడదు. అందరికీ ఒకే రూల్‌ వర్తింప చేయాలి. అప్పుడే పోలీస్‌ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుంది. రాష్ట్రంలో లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తనపై నిజాయితీగా యుద్ధం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఆ దిశగా మీరు ముందడుగు వేయండి. మీకు అండగా నేనుంటాను.  

పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు న్యాయం  
దేశంలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డు, పోలీసుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంగార్డ్‌ల జీతాలు మెరుగు పరిచాం. ఇంతకు ముందు రూ.18,000 ఇస్తున్న వేతనాన్ని రూ.21,300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. విధి నిర్వహణలో హోంగార్డ్‌ మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను మా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విధి నిర్వహణలో చనిపోతే.. హోంగార్డ్‌లకు, పోలీసులకు రూ.30 లక్షల ఇన్సూరెన్స్‌ కవరేజీని మన ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షల కవరేజీ అదనంగా వస్తుంది.

దేశంలో మొదటిసారిగా ఏపీలోనే ఈ ఇన్సూరెన్స్‌ కవరేజీని పోలీస్‌ సిబ్బంది పదవీ విరమణ తర్వాత కూడా వర్తించేలా నిబంధనలు తీసుకొచ్చిన హోం మంత్రి, డీజీపీలకు నా అభినందనలు. హోంగార్డ్, కానిస్టేబుల్, ప్రతి అధికారికి ఒక్కటే చెబుతున్నా.. విధి నిర్వహణలో మీరు మంచి పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేయండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా వుంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. అంతకు ముందు ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement