69వ రోజు పాదయాత్ర డైరీ | ys jagan prajasankalpa yatra dairy 69th day | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని  ఈ ప్రభుత్వాన్ని కోరడం కూడా అత్యాశే

Published Wed, Jan 24 2018 1:02 AM | Last Updated on Wed, Jul 25 2018 5:17 PM

ys jagan prajasankalpa yatra dairy 69th day - Sakshi

69వ రోజు

23–01–2018, మంగళవారం
చెన్నప్పనాయుడుపేట, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

గత 68 రోజులుగా వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో సింహపురికి చేరింది. దశాబ్దాలుగా కరువుకాటకాలతో సతమతమవుతున్న ఈ 4 జిల్లాల్లోని ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కరువుకాటకాల సమస్యలు ప్రకృతిపరమైనవైతే, తీర్చగలిగే అవకాశం ఉండీ.. పాలకులు పట్టించుకోని సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, పాలకులే సృష్టించిన సమస్యలు మరెన్నో.

పేదరికంతో, సమస్యలతో నిత్యం జీవన పోరాటం చేస్తున్న ఈ ప్రజలకు అండగా ఉండి, రక్షించాల్సిన ప్రభుత్వమే సమస్యగా మారితే.. పాలించే వారే సమస్యలు సృష్టించి పీడిస్తూ ఉంటే.. ప్రజలెలా బతకాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఉదయం 10.05 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టాను. ఈ జిల్లాలో మహి ళా చైతన్యం బాగా ఎక్కువంటారు. మొట్టమొదటిగా మద్య నిషేధ ఉద్య మాన్ని ప్రారంభించింది ఈ జిల్లా అక్కచెల్లెమ్మలే. అటువంటి ఈ జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. 

చెంబేడు గ్రామంలో హైస్కూలు విద్యార్థినులు.. వారు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల స్థితిగతుల గురించి ఏకరువు పెట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పూర్ణిమ అనే అమ్మాయి ‘అన్నా.. మా ఊరికి బస్సు సౌకర్యం సరిగా లేదు. మాతో పాటు బడికి రావడానికి టీచర్లు కూడా ఇబ్బందిపడుతున్నారు. రాత్రి పూట స్పెషల్‌ క్లాసెస్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది. వీధి దీపాల్లేవు, దారి కూడా సరిగా లేదు. తాగుబోతు యువకులు అమ్మాయిలను వేధిస్తున్నారు. స్కూల్లో టాయిలెట్ల నిర్వహణ ఘోరంగా ఉంది. మధ్యాహ్న భోజనం చాలా అధ్వానం. మాకు చదువుకోవాలని ఎంతగా ఉన్నా.. ఈ సమస్యలతో బడి మానేసే పరిస్థితులు వస్తున్నాయి.

అలా కొంతమంది అమ్మాయిలు బడి మానేశారు కూడా. మేమంతా పేద పిల్లలం. మా అమ్మానాన్నలు మమ్మల్ని ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించలేరు’ అంటూ ఆ బంగారు తల్లి చెబుతుంటే.. మనసులో ఓ వైపు బాధేసింది. మరో వైపు ఆ చిట్టితల్లి చైతన్యానికి ముచ్చటేసింది. విద్యార్థినులలోని ఇలాంటి ధైర్యం, చైతన్యం స్ఫూర్తిదాయకం.  అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆశా వర్కర్లు కలిశారు. ‘సార్‌.. తల్లీబిడ్డల సంరక్షణ నుంచి, ప్రజా రోగ్యానికి చెందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ విధులు నిర్వర్తిస్తు న్నాం. ఇంత చాకిరీ చేస్తున్నా.. నెలకు రూ.500 నుంచి 700 కూడా రావడం లేదు. అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో నెలకు రూ.6000 దాకా ఇస్తున్నారు. మాకన్నా రోజు కూలీలే నయం’ అంటూ ఆవేదన చెందారు. ఈ రోజు కలిసిన 108, 104 ఉద్యో గులదీ ఇదే సమస్య. వారి సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదట. ప్రభుత్వ విద్యను, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి, ప్రయివేటు సంస్థలకు కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని కోరడం కూడా అత్యాశే అవుతుంది. రాబోయే రోజు ల్లో వారి జీతాలు, జీవితాలను మెరుగుపర్చడమే కాకుండా, నాన్నగారు ఏ మహదాశయంతో 104, 108 వ్యవస్థలను ఏర్పాటుచేశారో.. దాన్ని మరిం త మెరుగ్గా కొనసాగిస్తానని భరోసా ఇస్తూ ముందుకు కదిలాను.

అంత ర్జాతీయంగా పేరొందిన షార్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, పులికాట్‌ సరస్సు, నేలపట్టు పక్షుల విడిది కేంద్రాలున్న çసూళ్లూరుపేట నియోజక వర్గంలో మొదటి రోజు పాదయాత్ర అలా సాగింది. సీఎంగారికి నాదో ప్రశ్న.. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నాలుగు సంవత్సరాలు చాలా సంతృప్తినిచ్చాయని చెప్పుకొంటున్నారు. ప్రజలేమో.. ఈ నాలుగేళ్ల నుంచి అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నామంటున్నారు. ప్రజలు ఇంత తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తుంటే.. మీకు సంతృప్తి ఎలా వచ్చింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement