నవ శకమే | YS Jagan PSR Nellore Tour Special Story | Sakshi
Sakshi News home page

నవ శకమే

Published Thu, May 30 2019 1:59 PM | Last Updated on Thu, May 30 2019 1:59 PM

YS Jagan PSR Nellore Tour Special Story - Sakshi

సింహపురిలో భవిష్యత్‌ ఆశలు చిగురించాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పరుగులు పెట్టిన అభివృద్ధి.. ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి గురైంది.  ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం  రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో జిల్లా రూపురేఖలు మారుతాయని ప్రజలు ధీమాతో ఉన్నారు. వైఎస్సార్‌ కృషి ఫలితంగా నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్‌లు మొదలుకొని సెజ్‌ల వరకు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. పారిశ్రామికంగా జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. వైఎస్సార్‌ హయాంలో కొత్త పుంతలు తొక్కిన ప్రగతి  అర్ధంతరంగా ఆగిపోయింది. వైఎస్‌ జగన్‌ సీఎంగా పెండింగ్‌ ప్రాజెక్ట్‌లకు మోక్షం లభించనుంది. ఇక ప్రగతి పనులు ఊపందుకుంటాయని జిల్లా వాసులు గంపెడాశతో ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:   జిల్లాపై విజన్‌ ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టనున్న క్రమంలో అభివృద్ధి పరుగులు తీయనుంది. ఓదార్పుయాత్ర మొదలు ప్రజా సంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారంతో జిల్లాకు పలు పర్యాయాలు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రగతిపై సమగ్ర అవగాహన కలిగి ఉన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి సారించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్డర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు ఆగిపోయిన ప్రగతి పగ్గాలు పట్టనున్నారు. జిల్లాలో నిమ్మ, ఆక్వా రైతుల కష్టాలు మొదలు కొని, చేనేత, మత్స్యకార, వివిధ కుల, చేతి వృత్తిదారులతో పాటు ప్రభుత్వ వ్యవస్థల పాలనపై పూర్తిగా అవగాహన ఉంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని కూడా ఆచరణకు సాధ్యమైన హామీలు ఇచ్చారు. జగన్‌ విశ్వసనీయతను నమ్మిన జనం పట్టారు. అది కూడా జిల్లాలో రికార్డు స్థాయిలో నూరు శాతం గెలిచి ప్రతిపక్ష అవసరం జిల్లాకు లేదని చెబుతూ జిల్లా ప్రజలు తీర్పు నిచ్చారు. గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో సర్వత్రా కోలాహలంగా మారింది.  

ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు
గడిచిన 9 ఏళ్లలో జిల్లాలో అనేక మార్లు వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో పర్యటించారు. వైఎస్సార్‌ మరణం తట్టుకోలేక జిల్లా వ్యాప్తంగా మరణించిన వారి కటుంబాలను  2010 అక్టోబర్, నవంబర్‌ నెలలో ఓదార్పు యాత్ర నిర్వహించి, నేరుగా వెళ్లి కలిసి వారిని పరామర్శించి మనోధైర్యం నింపారు. ఈ యాత్ర జిల్లాలో దాదాపు 45 రోజుల పైగా సాగిన క్రమంలో జిల్లాలోని అన్ని సమస్యలను నేతలు, ప్రజలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అనేక సమావేశాలు, పలు ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరయ్యారు. గతేడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ద్వారా 9 నియోజక వర్గాల్లో 266.5 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు. నిత్యం జనంతో మమేకం అయి పాదయాత్రలో నడిచి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. సూళ్లూరుపేటలో మొదలైన ప్రజా సంకల్ప యాత్ర ఉదయగిరిలో ముగిసింది. యాత్ర జిల్లాలోని 14 మండలాల్లో 142 గ్రామాల్లో మీదగా సాగి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది.

చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర వెయ్యి కిలో మీటర్ల మైలురాయిని గతేడాది జనవరి 29న సైదాపురంలో అధిగమించారు. సైదాపురంలో విజయసంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు. 1100 కిలో మీటర్లు యాత్ర పూర్తయిన సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 72 అడుగుల ఎత్తులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. యాత్ర సాగిన క్రమంలో ప్రతి నియోజకవర్గంలో సభలతో పాటు చేనేత, యాదవ, ఆర్యవైశ్య, ముస్లిం, మహిళలతో జరిగిన ప్రత్యేక సభల్లో పాల్గొన్నారు. ఇక ప్రత్యేక హోదా కీలక ప్రకటనలకు కూడా నెల్లూరు జిల్లా వేదికైంది. హోదా ఉద్యమం తార స్థాయికి చేరిన క్రమంలో పార్లమెంట్‌లో జరిగే పోరుబాటకు ఇక్కడే నుంచి దిశానిర్దేశం ప్రకటించారు. ఎంపీల రాజీనామా మొదలుకొని దశల వారీగా పోరాటాల కార్యాచరణ ఇక్కడే రూపొందించారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బంద్‌లో జగన్‌ ఇక్కడే పాల్గొన్నారు. మరో వైపు పాదయాత్రలో జిల్లాకు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం, రామాయపట్నం పోర్టు నిర్మాణం చేస్తామని సంగం, ఆత్మకూరు బిడ్జ్రి కమ్‌ బ్యారేజ్‌ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని పరిశ్రమలు, సెజ్‌ల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ విడుదలకు ముందు పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి సమరభేరి నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి, గూడూరు, నెల్లూరు సిటీల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు.

సింహపురి నుంచి సెజ్‌ల దాకా
జిల్లాలో 2004 నుంచి 2009 మధ్య అభివృద్ధి పరుగులు తీసింది. జిల్లా ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించే స్థాయిలో అభివృద్ధి చేసి జిల్లా చరిత్రలో, జిల్లా ప్రజల హృదయాల్లో దివంగత వైఎస్సార్‌ చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా పారిశ్రామికంగా, రాజకీయంగా విశిష్ట గుర్తింపు కలిగిన జిల్లాలో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేకపోవడంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. 2008 జూలై 14న కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 28న కొత్తగా వర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ను నియమించారు. ఆగస్టులో 6 కోర్సులతో నూతనంగా విక్రమ సింహపురి యూనివర్సిటీని ప్రారంభించారు. వీఎస్‌యూకు వెంకటాచలం మండలం కాకుటూరులో 83 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.25 కోట్లు నిధులను విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 21న 42 టీచింగ్‌ పోస్టులు, 33 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేశారు. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టును నవయుగ సంస్థకు అప్పగించి పనులు వేగంగా చేసేలా పర్యవేక్షించారు.

2008 జూలై 17న నాటి యూపీఏ చైర్మన్‌ సోనియాగాంధీతో కలిసి వైఎస్సార్‌ ఈ పోర్టును ప్రారంభించారు. పోర్టు ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో నెల్లూరు జిల్లాకు కేంద్ర బిందువు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మూడు సెజ్‌లు ఏర్పాటు చేశారు. తడ మండలం మాంబట్టులో ఏర్పాటు చేసిన సెజ్‌లో సుమారు 20 కంపెనీలు వరకు వచ్చాయి. ఇందులో సుమారు 15 వేల మందికి ఉపా«ధి కలిగింది. నాయుడుపేట మండలం మేనకూరులో ఏర్పాటు చేసిన సెజ్‌లో సుమారు 15 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సుమారుగా 10 వేలు మందికి ఉపాధి కలిగింది. నెల్లూరు–చిత్తూరు జిల్లా సరిహద్దులోని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ సెజ్‌లో సుమారు 50 కంపెనీల వరకు ఏర్పాటు చేశారు. సోమశిల రిజర్వాయర్‌ నీటి సామరŠాధ్యన్ని 38 టీఎంసీల నుంచి 78 టీఎంసీలకు పెంచి జిల్లాలో సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసిన నేతగా అన్నదాతల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. పెన్నా డెల్టా ఆధునికీకరణ, సంగం, నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థాపన,  ప్రధానంగా స్వర్ణముఖి బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. మెట్ట ప్రాంతాలకు పంపింగ్‌ స్కీం ద్వారా తాగు, సాగునీరు అందించే హైలెవల్‌ కెనాల్‌కు రూ.1000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది ఆయన హయాంలోనే కావడం విశేషం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement