ఓ దొంగ.. మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు : వైఎస్ జగన్‌ | YS Jagan Speech In Nellore Samara Shankaravam | Sakshi
Sakshi News home page

నెల్లూరులో వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం

Published Tue, Mar 5 2019 3:12 PM | Last Updated on Tue, Mar 5 2019 6:44 PM

YS Jagan Speech In Nellore Samara Shankaravam - Sakshi

సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రజల సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన ఓ నేరగాడు, దొంగ, నారాసురుడు అనే రాక్షసుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసం మన సమాచారాన్ని అమ్ముకుంటున్నారు.  రాష్ట్రంలో మొత్తం 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 20 లక్షల దొంగ ఓట్లు ఉంటే.. ఒక్క మన రాష్ట్రంలో 39 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా చంద్రబాబుకు చెందిన ప్రైవేటు కంపెనీల దగ్గర దొరుకుతోంది. ప్రభుత్వం దగ్గర ఉండే ఆధార్‌ డేటా ఇదే తరహాలో చోరికి గురైంది. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన ఎన్నికల డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంటే తప్పు ఎవరిది. ప్రజల సున్నితమైన డేటా చోరీ గురించి కేం‍ద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే మనల్ని, మన కార్యకర్తల్ని దూషిస్తారు. ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు.. సరైన ఓట్లు చేర్పించమని అర్జీ పెడితే మనం వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తారు. మా సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి పరిస్థితులు నారా లోకేష్‌కు మాత్రం ఎదురుకావు’ అని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన సమర శంఖారావ సభకు 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సభకు హాజరైన వైఎస్‌ జగన్‌ మొదట సభా ప్రాంగణంలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేషజనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అధికారంలోకి రాగానే కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. అధికార పార్టీ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.

అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా
వైఎస్‌ జగన్‌ ప్రసంగం కొనసాగిస్తూ... ‘చంద్రబాబు నిర్వాకం వల్ల మీ బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఆధార్‌ నంబర్లు ప్రైవేటు ఐటీ కంపెనీలైన బ్లూ ఫ్రాగ్‌, ఐటీ గ్రిడ్‌ చేతుల్లో ఉన్నాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను తయారు చేసింది కూడా ఈ కంపెనీలే. వీరి వద్దకు ప్రజల వ్యక్తిగత డేటా ఎలా వెళ్లింది. ఇవి రెండూ చంద్రబాబు బినామీ కంపెనీలు. ఇలాంటి నేరం సాధారణ వ్యక్తి చేసి ఉంటే అతడిని దొంగ అంటాం. కానీ మన ఖర్మ ఏంటంటే డేటా దొంగిలించిన వ్యక్తిని మనం సీఎం అంటున్నాం. ఆయన కొడుకును ఐటీ మంత్రి అంటున్నాం’  అని ఎద్దేవా చేశారు. టీడీపీ సేవామిత్ర యాప్‌నకు ఆధార్‌, ఫొటో లిస్టు, బ్యాంకు అకౌంట్లు అనుసంధానం చేసి తమకు అనుకూలంగా లేని ఓట్లను టీడీపీ తొలగిస్తోంది. డేటా ఎలా బయటకు వెళ్లిందని ప్రశిస్తే బాబు వాటికి సమాధానం చెప్పట్లేదు. సెల్‌ఫోన్‌ నేనే కనిపెట్టా, హైదరాబాద్‌ నేనే నిర్మించా అని పొంతన లేకుండా మాట్లాడతారు. తనకు తెలియని డేటానా అంటూ చిందులు వేస్తారు. ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడు సెక్షన్‌ 8 అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే తరహాలో తప్పించుకోవాలని చూస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఆంధ్రా కంపెనీలపై.. తెలంగాణ పోలీసుల దాడులు ఏంటని పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు’ అని మండిపడ్డారు.

నారాసుర పాలన చూస్తున్నాం..
‘టీడీపీకి మద్దతు పలకని ప్రజలకు రేషన్‌ కట్‌ చేస్తున్నారు. పెన్షన్‌ తొలగిస్తున్నారు. పేదవాళ్లు కట్టుకున్న ఇళ్లకు కూడా డబ్బు ఇవ్వడం లేదు. వెట్‌ల్యాండ్‌ పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలని డిస్‌క్వాలిఫై చేయకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతగా అధికార దాహం ఉన్న చం‍ద్రబాబు భవిష్యత్తులో ఓటు వేయలేదని మనుషులను చంపేయడం, గ్రామాలను తగలబెట్టడం కూడా చేస్తారేమో. ప్రస్తుతం రాష్ట్రంలో నారాసుర పరిపాలన చూస్తున్నాం’  అని వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు.

రోజుకో కొత్త సినిమా...
ఫ్లాపు సినిమాలు తీసే చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తుంటే ఓటమి భయంతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే... ‘గుంటూరు సభలో తాము పెన్షన్‌ రెండింతలు చేస్తామని హామీ ఇస్తే.. ఎన్నికల ముందు పెన్షన్‌ పెంచినట్టు సినిమా చూపిస్తున్నారన్నారు. ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ లేకుండా చేస్తామని.. ఆటోలకు, ట్యాక్సీలకు ఏడాదికి పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. అయితే ఇప్పుడే మేల్కొన్న చంద్రబాబు.. నిస్సిగ్గుగా మా పథకాలు కాపీ కొట్టారు. ఆటో డ్రైవర్ల కాకీ చొక్కా లాక్కొని ఫొటోలకు ఫోజులిచ్చారు. 2013లో బీసీ డిక్లరేషన్‌లో ఒక్క నిర్ణయం కూడా అమలు చేయని చంద్రబాబు... ఎన్నికల కోసమే రాజమండ్రిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు’ అని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

బుల్లెట్‌ ట్రైన్‌ ఏమయ్యింది బాబు...?
చంద్రబాబు తన మొదటి సినిమాలో భాగంగా... ‘2014 ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచిత విద్య అన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం.. లేకపోతే నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీసీ నోటిఫికేషన్లు.. ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రతి ఇంటికి రూ. 2 కే 20 లీటర్లు మంచినీరు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు..15 ఏళ్ళు కావాలి. వాల్మీకి, కురువులను ఎస్టీలుగా... రజకులను ఎస్సీలుగా... గాండ్లను ఎస్సీలుగా.. మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేరుస్తా. మూడేళ్ళలోనే పోలవరం పూర్తి చేస్తా. ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సాయం. ఆంధ్ర రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తెస్తా’ అని హామీలు ఇచ్చిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా తన మ్యానిఫెస్టోలోని ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా..  మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అంటూ ఎక్కడికక్కడ దోచేశారని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement