విజయవాడలో గురువారం జరిగిన ముఖ్యమంత్రిగా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ సభకు హాజరైన నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
పదేళ్లుగా జనంతో మమేకం అవుతూ.. అధికార పక్షాల ఎన్నో కుట్రలను ఛేదిస్తూ.. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో దగాపడిన రాష్ట్ర ప్రజలకు అండగా ‘నేను ఉన్నాను’ అంటూ విజయయాత్రను సాగించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడైన వేళ జిల్లా సంబరాల్లో మునిగిపోయింది. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అను నేను..’ అనే మాటను ప్రత్యక్షంగా, టీవీల్లో పరోక్షంగా వీక్షించిన జనహృదయాలు ఉప్పొంగిపోయాయి. ఈ సమయం కోసం పదేళ్లుగా ఎదురు చూసిన అభిమానులు పరవశించిపోయారు. జనహితమే లక్ష్యంగా ముందుకు సాగుతానని చేసిన ప్రకటనపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌మోహనుడి పట్టాభిషేక ఘట్టాన్ని వీక్షించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున విజయవాడకు తరలివెళ్లారు. మరో వైపు ప్రార్టీ శ్రేణులు, అభిమానులు ఊరు వాడల్లో పండగజేసుకున్నారు. అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుబి మోగించి రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లాలో చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి సత్తాచాటింది. తమపై నమ్మకం ఉంచిన జిల్లా ప్రజలకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నేత, తిరుగులేని ప్రజానాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహోత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు పార్టీ నేతలు విజయవాడకు పయనమయ్యారు. రాజసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి), ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి) పి. అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్), కాకాణి గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి) వెలగపల్లి వరప్రసాద్ (గూడూరు), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట)తో పాటు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. బుధవారం సాయంత్రానికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నవ శకం ఆరంభమైందని, అవినీతి రహిత పాలనతో పాటు అన్ని వర్గాలకు మేలు చేసేలా జగన్ జనరంజక పాలన సాగిస్తారని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి సంతకం వైఎస్సార్ పింఛన్‌పైనే చేయడం, పింఛన్‌ను పెంచడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో మిన్నంటిన సంబరాలు, సేవా కార్యక్రమాలు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద, దివంగత వైఎస్సార్ విగ్రహాల వద్ద, గ్రామ, మండల, నియోజకవర్గ ప్రధాన సెంటర్లలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తమ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నేత జగన్ ముఖ్యమంత్రి కావడం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగుతుందని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆలయాల్లో 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బాణసంచా కాల్చారు. జగన్ నినాదాలతో హోరెత్తించారు. దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పలు ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేయటం, అనాథాశ్రమాల్లో అన్నదానాలు తదితర కార్యక్రమాలు నిర్వహించి అభిమానం చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment