వాకతిప్ప పేలుడు బాధితులకు నేడు జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాకతిప్ప విస్ఫోట బాధితులను పరామర్శించనున్నారు. గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర లోని తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పేలుడు దుర్ఘటనను తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. ముందు అనుకున్న దాని ప్రకారం ఆయన మరో రెండురోజులు శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధిత గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే పేలుడు బాధితులను సత్వరం ఊరడించాలన్న సంకల్పంతో మంగళవారం రాత్రే శ్రీకాకుళం నుంచి నేరుగా కాకినాడ చేరుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట బస చేశారు. పలువురు పార్టీ నేతలు ఆయనను కలుసుకుని పేలుడు వివరాలను తెలిపారు.