లంచం లేకుండా పని జరగాలి | YS Jagan Video Conference with District Collectors | Sakshi
Sakshi News home page

లంచం లేకుండా పని జరగాలి

Published Wed, Jul 24 2019 3:54 AM | Last Updated on Wed, Jul 24 2019 3:54 AM

YS Jagan Video Conference with District Collectors - Sakshi

సాక్షి, అమరావతి: రూపాయి లంచం లేకుండా పని జరిగిందన్న పేరు రావాలని, ఇందుకు కొన్ని నియమాలు, నిబంధనలు, ప్రమాణాలు తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దీనిపై కలెక్టర్లు మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎమ్మార్వో, పోలీసుస్టేషన్లు, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్‌ కార్యాలయాల్లో అవినీతి అన్నది కనిపించకూడదని స్పష్టం చేశారు. స్పందన సమస్యల పరిష్కారంలో పురోగతి సాధించినందుకు, వినతులు ఇస్తే పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని కలిగించినందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జూలై 12 వరకు పెండింగ్‌లో 59 శాతం సమస్యలుంటే, జూలై 19 నాటికి 24 శాతానికి తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత ఇంకా మెరుగుపడాలని, స్పందన కింద వచ్చే సమస్యలను వేగవంతగా పరిష్కరించాలని సూచించారు. ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ పక్కపక్కనే ఉంటారు కాబట్టి పర్యవేక్షణతో పాటు నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుందన్నారు. స్పందన కార్యక్రమం కింద సమస్యలను స్వీకరించాక కలెక్టర్లు ఒక గంట ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే నాణ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. ఎమ్మార్వోలు, ఎస్‌ఐలతో ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారా.. లేదా అనే విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పశ్చిమగోదావరి జిల్లాలో స్పందన సమస్యల పరిష్కారంలో ట్రాకింగ్‌ విధానం బాగుందని ముఖ్యమంత్రి అన్నారు. 

అవినీతి రహిత వ్యవస్థ రావాల్సిందే
ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో అవినీతి అనేది ఉండకూడదని, మండల అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ఈ విషయాన్ని పదే పదే చెప్పాలని, వ్యవస్థ అవినీతి రహితంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలీసుస్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కొన్ని పిటీషన్లు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండటం గురించి ఎస్పీలు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేశారు.. ఇకపై ఏం చేయబోతున్నారో చెప్పాలన్నారు. ఇలాంటి కేసులను ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించి పరిష్కారానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు. దీని వల్ల పిటీషన్‌ ఇచ్చిన వారికి బాధ్యతగా సమాచారం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మనం సమస్యను సీరియస్‌గా తీసుకుంటామని, చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నామనే సంకేంతం పోవాలన్నారు. పోలీసుస్టేష్లలో రిసెప్షనిస్టులు చిరునవ్వుతో స్వాగతించాలని, ఎందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చామనే భావన రాకూడదని స్పష్టం చేశారు. కొన్ని భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలనే ఆత్రుతలో న్యాయం కన్నా, అన్యాయం చేశామనే భావన వచ్చే అవకాశం ఉందని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు
అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, రేషన్‌ కార్డు, హౌసింగ్‌ లాంటి సమస్యలను 72 గంటల్లోగా పరిష్కారం ఉండాలని, రేషన్‌ కార్డును గ్రామ సచివాలయమే ప్రింట్‌ చేసి లబ్ధిదారునికి అందిస్తుందని సీఎం చెప్పారు. పరిపాలనలో  విప్లవాత్మక మార్పుగా దీనిని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ప్రతి జిల్లాలో పని చేయని మురుగునీటి శుద్ధిప్లాంట్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను గుర్తించాలని ఆదేశించారు. నిర్వహణ సరిగా లేక మూత పడుతున్నాయని, కలెక్టర్లు వీటిపై దృష్టి పెట్టి కచ్చితంగా నడిచేలా చేయాలని సూచించారు. లేకపోతే పెట్టిన ఖర్చు వృథా అయినట్లేనని, నిధులు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఉగాది నాటికి ప్రతి నిరుపేదకూ ఇంటి స్థలం ఇవ్వాలని, ఇది కలెక్టర్లకు చాలా పెద్ద టాస్క్‌ అని, ఇంతకు ముందు ఎవ్వరూ ఇలాంటి కార్యక్రమం చేయలేదని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించామని, కలెక్టర్ల తరఫున సమన్వయం కోసం సీపీఎల్‌ఏలో ఒక అధికారిని నియమించామని సీఎం పేర్కొన్నారు.

పాఠశాలల రూపు రేఖలు మార్చాలి
హాస్టళ్లలో వసతుల మెరుగు కోసం ప్రతి జిల్లాకు కేటాయించిన నిధులు వచ్చాయా లేదా అంటూ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రతి జిల్లాకు ఏడు కోట్ల రూపాయల చొప్పున ఇచ్చామని, మిగిలిన డబ్బు కూడా ఇస్తామని అధికారులు తెలిపారు. హాస్టళ్లు బాగు చేయడానికి ఈ నిధులు వెచ్చించాలని, ప్రతి హాస్టల్‌ను కూడా విద్యార్థులు ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు ఇంకా అవసరమైతే ఎక్కువ నిధులు ఇస్తామని, ఇంకా ఎక్కడెక్కడ నిధులు అవసరమో ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లకు సంబంధించి ఇవాల్టి పరిస్థితి ఏంటన్నది ఫొటోలు తీయాలని, రెండు మూడేళ్లలో వ్యవస్థీకృతంగా స్కూళ్లను మెరుగు పరుస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏటా మూడింట ఒక వంతు స్కూళ్లపై దృష్టి సారించాలని చెప్పారు.  బాత్‌రూం, నీళ్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, బ్లాక్‌ బోర్డులు, కాంపౌండ్‌ వాల్, పెయింటింగ్, ఫినిషింగ్‌ పనులు కచ్చితంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లలోని బాత్‌ రూమ్స్‌ను శుభ్రం చేసే వారికి సామగ్రి సహా కనీసం 5 వేల రూపాయలు జీతంగా ఇవ్వాలన్నారు. ఆధునికీకరించాక ఫొటోలు తీసి, గతంలో ఉన్న ఫొటోలతో పోల్చి చూపాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్లు, ఎస్పీలు 

విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడండి
కరెంటు కోతలు ఎక్కడా ఉండకూడదని చెప్పారు. వర్షాలకు ముందు మెయింటెనెన్స్‌కు గత ప్రభుత్వం అంగీకరించలేదని చెబుతున్నారని, దీని వల్ల అక్కడక్కడా అంతరాయాలు వస్తున్నాయన్న సమాచారం కొన్ని వర్గాల నుంచి వస్తోందని చెప్పారు. ఎక్కడా కూడా విద్యుత్‌ అంతరాయాలు రాకుండా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నట్లు సమాచారం ఉందని, కొంత వెసులు బాటు ఇవ్వండని చెప్పామని, అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకోవాలన్నారు. ఇసుక కొరత ఎక్కడ ఎక్కువ ఉందో చూసి సరఫరాను పెంచాల్సిందిగా సీఎం సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement