
సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆస్తుల కేసులో చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 8వ తేదీతోనే సుప్రీం కోర్టు విధించిన గడువు ముగియడంతో ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తుది చార్జిషీటు దాఖలు చేయాలని సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులకు తెలిపింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకే జగన్ తాజాగా నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీబీఐ మాత్రం ఇంతవరకు తుది చార్జిషీటు దాఖలు చేయలేదు. జగన్ బెయిల్ పిటిషన్పై గురువారం నాటికల్లా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. తాజాగా జగన్ ఆస్తుల కేసులో సీబీఐ సోమవారం నాడు మూడు చార్జిషీట్లు దాఖలుచేసింది. దీంతో మొత్తం ఎనిమిది చార్జిషీట్లు దాఖలు చేసినట్లయింది. విచారణలో భాగంగా మరో రెండు రోజుల్లో మరికొన్ని చార్జిషీట్లు కూడా దాఖలు చేసే యోచనలో సీబీఐ ఉన్నట్లు తెలుస్తోంది.