
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం శుక్రవారం రాత్రి తిరుమల వస్తున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం దర్శనం పూర్తయ్యాక తిరిగి హైదరాబా ద్ బయలుదేరతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి వివరిం చారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత తిరుమల పర్యటనను, 6న చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.