సాక్షి, రాజంపేట: రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 1989 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్‌ను ఎంపీగా గెలిపించడంలో వైఎస్ కీలకపాత్ర పోషించారు. వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. నాడు వైఎస్ వెంట నడిచిన రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం.. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బాసటగా నిలిచి రాజంపేటపై రాజన్న ముద్ర సుస్థిరం అని చాటి చెప్పారు.
కడప సెవెన్‌రోడ్స్ : రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం ఇటు వైఎస్సార్, అటు చిత్తూరు జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు ఈ నియోజకవర్గ పరి«ధిలో ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలు రాజంపేట లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1896 పోలింగ్ కేంద్రాలు ఉండగా 14,69,575 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ నియోజకవర్గ ఫలితాలను గమనిస్తే తొలినుంచి కాంగ్రెస్ హవా నడిచింది. 11సార్లు కాంగ్రెస్ విజయకేతనం ఎగురేసింది. దేశంలో ఎక్కడైనా జరిగాయో లేదో తెలియదుగానీ 1957లో తొలి ఎన్నికే కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ విశ్వనాథరెడ్డి ఏకగ్రీవం కావడం విశేషం. స్వతంత్ర అభ్యర్థిగా 1962లో సీఎల్‌ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా 1984లో సుగవాసి పాలకొండ్రాయుడు, 1999లో గునిపాటి రామయ్య మాత్రమే ఇప్పటివరకు ఎంపికయ్యారు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మిథున్‌రెడ్డి 174762 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆయనకు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ రావడం విశేషం. రాజంపేట అసెంబ్లీలో 8648, రైల్వేకోడూరులో 9393, రాయచోటిలో 50036, తంబళ్లపల్లెలో 11554, పీలేరులో 33148, మదనపల్లెలో 12019, పుంగనూరులో 46009 ఓట్ల ఆధిక్యత వచ్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి అన్ని అసెంబ్లీల్లో మెజార్టీ వచ్చినా రాజంపేట, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మల్లికార్జునరెడ్డి, శంకర్‌యాదవ్ గెలుపొందారు. మిథున్‌రెడ్డికి మొత్తం 601752 ఓట్లు రాగా, టీడీపీ–బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి 426990 ఓట్లు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి జి.ముజీబ్ హుసేన్ డిపాజిట్ కోల్పొయినప్పటికీ 59,777 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ కేవలం 29,332 ఓట్లు సాధించి ధరావత్తు కోల్పోయారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి కులస్తులు మూడుసార్లు గెలుపొందగా, మిగతా అన్ని సార్లు బలిజ సామాజికవర్గం నేతలు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment