అదే జోరు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు జిల్లాలో రెండవ రోజు ఘన స్వాగతం లభించింది. ఆదివారం కదిరిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆమె ఆ రాత్రికి హిందూపురంలో బస చేశారు. సోమవారం అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హిందూపురం నుంచి మడకశిరకు చేరుకునే మార్గమధ్యలో ఊళ్లకు ఊళ్లు రోడ్లపైకి వచ్చాయి. అభిమానం అడుగడుగునా అడ్డుపడి నీరాజనాలు పలకడంతో వైఎస్ విజయమ్మ షెడ్యూలు సమయంకన్నా 2.30 గంటలు ఆలస్యంగా ఉదయం 11.30 గంటలకు మడకశిరకు చేరుకున్నారు. అప్పటికే మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్ జనసంద్రంగా మారింది. వైఎస్ విజయమ్మ అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడ పోటెత్తిన జనసంద్రాన్ని ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ప్రసంగించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన మడకశిరను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన తీరును ఆమె ప్రజలకు వివరించారు. మడకశిరను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దిన తీరును వివరించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రసంగం ముగించిన అనంతరంమడకశిరలో నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్ విజయమ్మకు మద్దతు తెలుపుతూ ప్రచారరథం వెంట జనం పరుగులు తీశారు. మడకశిర నుంచి మావటూరు, పెనుకొండ క్రాస్, గుట్టూరు క్రాస్, చెన్నేకొత్తపల్లి క్రాస్, ఎన్‌ఎస్ గేటు, ప్యాదిండి మీదుగా వైఎస్ విజయమ్మ ధర్మవరానికి బయలుదేరారు. ధర్మవరానికి షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోవాలి.
కానీ.. మడకశిర నుంచి ధర్మవరం వరకూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రహదారిపైకి చేరుకున్నారు. వైఎస్ విజయమ్మకు అడుగడుగునా నీరాజనాలు పలకడంతో 2.30 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మవరానికి చేరుకున్నారు. ధర్మవరం శివారులో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి కాలనీ వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్ విజయమ్మకు ఘన స్వాగతం పలికాయి. షిర్డి సాయిబాబా దేవాలయం, ఆర్టీసీ బస్టాండు, కాలేజీ సర్కిల్ మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ పాండురంగస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో జనసంద్రం పోటెత్తింది. చేనేత కార్మికులు భారీ ఎత్తున హాజరయ్యారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా 48 గంటలపాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేయడాన్ని విజయమ్మ గుర్తుచేసినప్పుడు నేతన్నల నుంచి మంచి స్పందన లభించింది.
చేనేత కార్మికులకు రూ.312 కోట్ల రుణాలను వైఎస్ మాఫీ చేశారని గుర్తు చేశారు. రాయితీపై ముడిపదార్థాలు నేతన్నలకు అందించారని.. ఆప్కోతో వస్త్రాలు కొనుగోలు చేయించి చేతినిండా పని కల్పించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తక్షణమే.. వైఎస్ చేపట్టిన పథకాలను అమలు చేయడంతోపాటూ ఉచితంగా మగ్గాలను అందిస్తారని హామీ ఇచ్చారు. పాండురంగస్వామి దేవాలయం నుంచి తేరుబజారు మీదుగా రైల్వేగేటు వరకు నిర్వహించిన రోడ్‌షోకు భారీ స్థాయిలో చేనేత కార్మికుల కుటుంబాలు హాజరై.. సంఘీభావం తెలిపాయి. బత్తలపల్లి, ఎస్కే యూనివర్శిటీ మీదుగా వైఎస్ విజయమ్మ రాత్రి ఏడు గంటలకు అనంతపురం చేరుకున్నారు. కలెక్టరేట్, పాతూరు, గాంధీ విగ్రహం, నీలం థియేటర్,
శ్రీకంఠం సర్కిల్, రాజు రోడ్డు మీదుగా కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్‌షో నిర్వహించారు. అనంతపురం నగరంలో భారీ ఎత్తున ప్రజలు హాజరై రోడ్‌షోను విజయవంతం చేశారు. వైఎస్ విజయమ్మ రోడ్‌షోలకూ ప్రచారసభలకూ హాజరవుతోన్న వారిలో సింహభాగం యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఉండటం గమనార్హం. యువత, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక లోకాన్ని ఒపినీయన్ లీడర్స్(అభిప్రాయ నిర్ణేతలు)గా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తారు. ఆ వర్గాలు ఎటు మొగ్గుచూపితే అటు విజయం ఉంటుందన్నది అనేక సందర్భాల్లో రూడీ అయ్యింది. వైఎస్ విజయమ్మ సభలకు ఆ వర్గాల ప్రజలే అధికంగా హాజరవుతోండటంతో ప్రత్యర్థి పార్టీల నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.