డెల్టాలో ఘనభేరి
డెల్టాలో ఘనభేరి
Published Sun, Apr 13 2014 2:03 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
= నందివెలుగు నుంచి ప్రారంభమైన వైఎస్సార్ జనభేరి
= వై.ఎస్.విజయమ్మకు అభిమానుల బ్రహ్మరథం
= మండుటెండను సైతం లెక్క చేయని ప్రజలు
= అడుగడుగునా హారతులు, పూలతో ఘన స్వాగతం
= ఆత్మీయ నేతను చూసేందుకు బారులు తీరిన మహిళలు, వృద్ధులు
= తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో రోడ్‌షోకు అపూర్వ స్పందన
సాక్షి, గుంటూరు :సహనానికి ప్రతీక... ఓదార్పుకు ప్రతిరూపం... పేద ప్రజలకు ఓ భరోసా.. అణగారిన వర్గాలకు ఆశాకిరణం.. అమ్మ విజయమ్మకు డెల్టా ప్రజానీకం నీరాజనాలు పలికింది. దివంగత మహానేత రాజన్నపై ఉన్న అభిమానం, ఆ కుటుంబం పడిన కష్టాలను తలుచుకుని దుఃఖించిన ప్రతి హృదయం జననేత జగనన్నకు సహకారం అందించాలన్న లక్ష్యం.. ప్రతి గుండెలో ప్రతిధ్వనించింది. ప్రతి కంటిలో సాక్షాత్కరించింది. ప్రచండ భానుడి ప్రతాపాన్ని సైతం లెక్క చేయని అభిమానులు మంచి మనిషి రాక కోసం ఎదురు చూశారు. మాకోసం పరితపిస్తున్న మీ కుటుంబం వెంటే ఎప్పటికీ ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. వైఎస్సార్ జనభేరి కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు డెల్టా ప్రాంతంలోని తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో అపూర్వ స్వాగతం లభించింది.
జనభేరి రథం శనివారం ఉదయం 10.30 గంటలకు నందివెలుగు సెంటర్‌కు చేరింది. సహన మూర్తిని చూసిన ప్రజలు ఎర్రటి ఎండను పండు వెన్నెలా భావించి తమ అభిమానం చాటారు. పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకటరోశయ్యలు అశేష జనవాహినితో విజయమ్మకు ఎదురేగి స్వాగతం పలికారు. నందివెలుగు సెంటర్‌లో కొద్దిసేపు ప్రసంగించిన విజయమ్మ అక్కడి నంచి కొలకలూరు గ్రామంలోకి ప్రవేశించారు. అనంతరం గుడివాడ చేరుకున్న విజయమ్మను చూసేందుకు కిలో మీటరు దూరానున్న ఎరుకలపూడి నుంచి ఎర్రటి ఎండలో నడిచి వచ్చిన మహిళలు అభిమాన నేతకు అభివాదం చేశారు.
జగన్‌తోనే రాజన్న రాజ్యం సాకారం..
గుడివాడలోని చర్చి సెంటర్‌కు చేరుకున్న విజయమ్మకు మహిళలు పెద్ద ఎత్తున పూలతో ఘనస్వాగతం పలికారు. రాజశేఖరరెడ్డి భార్యగా, జగన్ తల్లిగా మీముందుకు వచ్చానని, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగన్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కోపల్లె చేరుకున్న విజయమ్మకు పూలతో స్వాగతం పలికారు. అక్కడ రెండు నిమిషాలు మాట్లాడిన ఆమె గ్రామస్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంగలకుదురుకు చేరుకున్న విజయమ్మకు యువకులు పెద్ద ఎత్తున ద్విచక్రవాహనాలతో ఎదురేగి స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూడా విజయమ్మను చూసేందుకు మహిళలు, వృద్ధులు రోడ్డు వెంబడి బారులు తీరారు. అంగలకుదురులో భోజన విరామ సమయంలో మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) విజయమ్మకు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వేమూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు.
దిండిపాలెంలో అభిమానుల పూలవాన
వేమూరు నియోజకవర్గంలోని దిండిపాలెం చేరిన విజయమ్మపై స్థానిక మహిళలు పూల వాన కురిపించారు. పార్టీ సమన్వయకర్త మేరుగ నాగార్జున కార్యకర్తలతో ఎదురొచ్చి స్వాగతం పలికారు. యడ్లపల్లి ప్రజలు తామంతా మీవెంటేనంటూ నినాదాలు చేశారు. వలివేరు గ్రామంలోకి అడుగు పెట్టిన విజయమ్మను చూసి తమ ఆడపడచు వచ్చిందన్నంత ఆనందంతో మహిళలు ఆమెకు హారతులిచ్చారు. మండల కేంద్రమైన చుండూరుకున్న విజయమ్మ రోడ్‌షోకు అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. ఆమె గ్రామంలోకి అడుగు పెట్టగానే అందరి మోములు ఆనందంతో వికసించాయి. విజయమ్మ మాట్లాడుతూ రాజన్న స్వర్ణయుగాన్ని తెచ్చుకునేందుకు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలంటూ విజయమ్మ అనగానే ప్రజలు సైతం ఫ్యాను గుర్తుకే మా ఓటు అంటూ గర్జించారు.
మోపర్రులో అభిమానుల సందడి..
అక్కడి నుంచి మోదుకూరు గ్రామానికి చేరుకున్న విజయమ్మ రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. జోహార్ వైఎస్సార్, జై జగన్, విజయమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో గ్రామం మారుమోగింది. ఆలస్యమవుతున్నప్పటికీ అభిమానుల కోరిక మేరకు గ్రామంలో రెండు చోట్ల విజయమ్మ ప్రసంగించారు. అనంతరం అమృతలూరు మండలం మోపర్రుకు చేరుకోగానే ఈలలు, కేకలతో అభిమానులు హోరెత్తించారు. అక్కడి నుంచి తురిమెళ్ళ గ్రామంలో మహిళలు హారతిచ్చి అభిమానం చాటుకున్నారు. అమృతలూరు మీదుగా గోవాడ, ఇంటూరులో రోడ్డుషో నిర్వహించిన విజయమ్మ బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలులో తన రాక కోసం ఎదురు చూస్తున్న అశేష జనవాహినిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి కోన రఘుపతి అమృతలూరు వద్ద ఆమెకు స్వాగతం పలికారు. రోడ్‌షోలో పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు దాది లక్ష్మీరాజ్యం, ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
Advertisement