విజయమ్మ నేతృత్వంలో రేపు ఢిల్లీకి | ys vijayamma moves delhi to meet pranab mukherjee | Sakshi
Sakshi News home page

విజయమ్మ నేతృత్వంలో రేపు ఢిల్లీకి

Published Sun, Oct 6 2013 2:11 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

విజయమ్మ నేతృత్వంలో రేపు ఢిల్లీకి - Sakshi

విజయమ్మ నేతృత్వంలో రేపు ఢిల్లీకి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రం నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించనున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలో ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్తుందన్నారు. అక్కడ లెఫ్‌‌ట నేతలతో పాటు లౌకికవాదానికి, దేశ శ్రేయస్సుకు కట్టుబడి ఉన్న పార్టీ నేతలందరినీ కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించడంతో పాటు జగన్‌ చేసిన విజ్ఞప్తిని రాష్టప్రతికి అందజేస్తామన్నారు. ఈ బృందంలో తనతోపాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, డీఏ సోమయాజులు, శాసనసభాపక్ష ఉపనేతలు భూమా శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత ఉంటారన్నారు.

మంత్రుల వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టడమే..

‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు మాట్లాడుతూ... మేం ఈ తీర్మానం ఓడించిన తర్వాతే రాజీనామా చేస్తామంటున్నారు. వారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఏ తీర్మానాన్ని మీరు ఓడించాలనుకుంటున్నారు? ఆర్టికల్‌ 3 కింద బిల్లు అయిపోయిన తర్వాత రాష్టప్రతి శాసనసభను అభిప్రాయం మాత్రమే అడుగుతారు. అందువల్ల ప్రయోజనం ఉండదు. కేవలం మీరు చేసే చర్య కంటితుడుపు మాత్రమే అవుతుంది’’ అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. అంతేకాని కుంటిసాకులు చెప్పడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడమే కాక మోసగించినట్లవుతుందన్నారు.

 

అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు నిరాహారదీక్ష చేపట్టదలిచారో ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వాలని మైసూరా డిమాండ్‌ చేశారు. ఆయన ఢిల్లీలో చేపట్టిన దీక్ష సమైక్యం కోసమా, లేక విభజన కోసమా అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత జగన్‌ అందరికీ విజ్ఞప్తి చేశారని, సమైక్యానికి కట్టుబడిన వారందరూ ఒకే వేదిక మీదకు రావాలని చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇవేవి తేల్చకుండా ఇతరులపై బురదజల్లే కార్యక్రమం చేయడం చంద్రబాబుకు మంచిదికాదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement