సమస్య పరిష్కరించండి | Ys vijayamma to meet President today for a solution | Sakshi
Sakshi News home page

సమస్య పరిష్కరించండి

Published Tue, Aug 27 2013 4:43 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

సమస్య పరిష్కరించండి - Sakshi

సమస్య పరిష్కరించండి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆవేదన, ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల ఆక్రందనలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి దృష్టికి తెచ్చి, పరిష్కారం కోరేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతోంది. ఈ బృందంలో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దూరదృష్టి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరంకుశంగా తీసుకున్న నిర్ణయంవల్ల రగిలిపోతున్న పరిస్థితులు, సీమాంధ్ర ప్రజల ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేయనున్నారు.
 
 ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం 12.30 గంటల అనంతరం వీరు రాష్ట్రపతిని కలిసి ఇక్కడి ప్రజల ఆవేదనను విన్నవిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కూడా రాష్ట్ర ప్రజల ఆందోళనలపై వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు సమాచారం.
 
 రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో గతంలో అనేకమార్లు తమ పార్టీ చెప్పిందనీ, అదే విషయాన్ని ఒక ప్రథమ పౌరుడుగా రాష్ట్రపతికి, ప్రధానికి తమ ప్రతినిధి బృందం వివరిస్తుందని కొణతాల తెలిపారు. విభజనవల్ల పారిశ్రామిక, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో ఉభయ ప్రాంతాలు నష్టపోతాయని, అలాగే ఉద్యోగ భద్రత కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ ఒక పరిష్కారం చూపకుండా దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం రావణకాష్టం అవుతుందని ఆయన దృష్టికి తెస్తామని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు నెల రోజులుగా ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ప్రజా ఉద్యమాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లి తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement