అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు | YS Vivekananda Reddy funeral was completed | Sakshi
Sakshi News home page

అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు

Published Sun, Mar 17 2019 3:49 AM | Last Updated on Sun, Mar 17 2019 1:59 PM

YS Vivekananda Reddy funeral was completed - Sakshi

అశేష అభిమానుల మధ్య వైఎస్‌ వివేకా అంతిమయాత్ర. (ఇన్‌సెట్‌లో) వివేకా పార్థివదేహం

సాక్షి, కడప: మనసున్న మంచి నాయకుడిగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజల కన్నీటి వీడ్కోలు నడుమ ముగిశాయి. దారుణ హత్యకు గురైన మాజీ ఎంపీ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల అశ్రుతర్పణం నడుమ వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కడసారి చూపుకోసం జనం బారులు
అంతకుముందు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్‌ వివేకా నివాస ప్రాంగణం వద్ద ‘అజాత శత్రువు’ను కడసారి చూసేందుకు ప్రజలు శనివారం పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రజల అభిమాన నాయకుడు.. అందరితోనూ ఇట్టే కలిసిపోయిన నేత.. తమ కష్టసుఖాలు పంచుకున్న వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక లేరని తలుచుకుని జనం రోదించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులతో ఇంటి పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా వారంతా మనసున్న మంచి నాయకుడు వివేకా అంటూ తలుచుకుని తల్లడిల్లిపోయారు. భౌతిక కాయం మీద పడి పలువురు రోదించడం కనిపించింది. వివేకాను కడసారి చూసేందుకు వచ్చిన జనం బారులు తీరారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు వైఎస్‌ వివేకా పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కన్నీటిపర్యంతమైన వైఎస్‌ కుటుంబ సభ్యులు..
వైఎస్‌ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటున్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం కుటుంబసభ్యులను కలిచివేసింది. అందులోనూ వివేకా హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా కలత చెందారు. ఇక వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ వేదనకు అంతులేకుండా పోయింది. భర్తను తలుచుకుని విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. భౌతిక కాయంపై పడి ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. మరోవైపు వివేకా వదినలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మ, మేనత్త కమలమ్మ, కుమార్తె సునీత, షర్మిలమ్మ తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు.  

వివేకా అంతిమ ఘట్టం.. 
తర్వాత ఉదయం 11 గంటల సమయంలో పులివెందులలోని వైఎస్‌ వివేకానందరెడ్డి నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. వైఎస్‌ వివేకా పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంలో పెట్టి ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండు, మెయిన్‌ రోడ్డు మీదుగా రాజారెడ్డి ఘాట్‌ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ వివేకా అమర్‌ రహే.. జోహార్‌ వైఎస్‌ వివేకా అంటూ ప్రజలు నినాదాలు చేశారు. అంతిమ యాత్రలో వేలాదిగా జనం పాల్గొన్నారు. 

అంతిమ యాత్రలో వైఎస్‌ జగన్‌ 
తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి అంతిమయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్థీవ దేహం ఉన్న ప్రత్యేక వాహనం వెంట జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిలు నడుస్తూ వచ్చారు. వారితోపాటు జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సమాధి ఘాట్‌ వద్ద వైఎస్‌ కుటుంబ సభ్యులైన వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతిరెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, షర్మిలమ్మ, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, బామర్ది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు అంతిమ ఘట్టంలో పాలు పంచుకున్నారు. వారేకాక ఇతర వైఎస్‌ కుటుంబ సభ్యులందరూ పాల్గొని వివేకాకు చివరి వీడ్కోలు పలికారు. 

వైఎస్‌ వివేకాకు నివాళులర్పించిన నేతలు..
అంతకుముందు పులివెందులలోని వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని వైఎస్సార్‌సీపీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు సందర్శించి నివాళులర్పించారు. వీరిలో మాజీ మంత్రులు ఎంవీ మైసూరారెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, చింతామోహన్, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌ బాష, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందురెడ్డి, జంగా కృష్ణమూర్తి, కర్నూలు వైఎస్సార్‌సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి, శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాసు, బీజేపీ జాతీయ నాయకుడు కందుల రాజమోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించిన జగన్‌.. 
తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ను సందర్శించి పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement