సాక్షి ప్రతినిధి, కడప: అత్యంత సౌమ్యునిగా పేరుపొందిన వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ చాణక్యంలో తనకు తానే సాటి. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి 2005లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అనవసర రాజకీయ సవాళ్లను విసిరి చిక్కులు కొనితెచ్చుకుని డీలా పడగా.. వివేకానందరెడ్డి జమ్మలమడుగుకు వెళ్లి ఆయన భుజం తట్టి ధైర్యం నూరిపోశారు. ఒకటిన్నర దశాబ్దంక్రితం జరిగిన ఈ సంఘటనను జమ్మలమడుగు వాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 2005 సెప్టెంబర్‌లో గ్రామపంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీగా ఎదిగిన జమ్మలమడుగు మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆది రాజకీయ ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి షాద్‌నగర్ జంట హత్య కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ పగ్గాల్ని రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిర నడిపిస్తోంది. ఆ పరిస్థితుల్లో 2005 సెప్టెంబర్ 24న జమ్మలమడుగు నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 20 వార్డుల్లో టీడీపీ మూడు వార్డులు గెలుచుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆది బహిరంగంగా ప్రకటించారు.(వెలుగులోకి మరో కుట్రకోణం!)
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 17 వార్డులను గెలుచుకోగా.. టీడీపీకి సరిగ్గా మూడు స్థానాలే వచ్చాయి. దీంతో జమ్మలమడుగు టీడీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చడం, కేకలు, ఈలలతో సంబరాలు జరుపుకున్నారు. అంతేగాక ఆదినారాయణరెడ్డి రాజీనామా చేయాలంటూ అరుపులకు దిగారు. దీంతో 17 స్థానాలు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆరోజు మధ్యాహ్నం కౌంటింగ్ కేంద్రం నుంచి నేరుగా తన బావమరిది సూర్యనారాయణరెడ్డి ఇంటికొచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భోజనం కూడా చేయకుండానే నిరాశతో మంచంపై వాలిపోయాడు. రాజీనామా చేయాలా? వద్దా? చేస్తే పరిస్థితేంటి? అర్థం కాని స్థితిలో పడిపోయాడు.(మళ్లీ అదే తరహా కుట్ర..)
ఆ పరిస్థితుల్లో అదేరోజు సాయంత్రం జమ్మలమడుగుకు వెళ్లిన వైఎస్ వివేకానందరెడ్డి దిగాలుపడ్డ ఆదినారాయణరెడ్డిని భుజం తట్టి లేపి కూర్చొబెట్టారు. ఇలాంటివి రాజకీయాల్లో సహజమని, అంతలా డీలా పడాల్సిన అవసరం లేదని గుండె నిబ్బరాన్ని నూరిపోశారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలా రాజకీయ సవాళ్లను విసరకూడదని సున్నితంగా మందలించారు. ఆరోజు సాయంత్రమే వైఎస్ వివేకానందరెడ్డి జమ్మలమడుగులో ప్రెస్‌మీట్ పెట్టి ‘‘మా ఆదినారాయణరెడ్డి సవాలు విసిరారు కానీ, ఆ సవాలును అటువైపు నుంచి ఎవరూ స్వీకరించలేదు. ఒకవేళ వాళ్లు స్వీకరించి ఉంటే మా ఆదినారాయణరెడ్డి తప్పక రాజీనామా చేసేవాడే. వాళ్లెవరూ ముందుకు రాలేదు కాబట్టి మా ఆదినారాయణరెడ్డి కూడా రాజీనామా చేయడు’ అంటూ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. దీంతో గండం గట్టెక్కించారనుకుని ఆది ఊపిరి పీల్చుకున్నాడు. అంతవరకు ఆది రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టిన టీడీపీ కార్యకర్తలు వివేకా ప్రదర్శించిన రాజకీయ చాణక్యానికి సైలెంట్ అయిపోయారు. (వైఎస్ వివేకా దారుణ హత్య...)
Comments
Please login to add a commentAdd a comment