సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాలకు పైగా అంటే 95 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ ఈ ఏడాది జనవరి 3వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే రోజు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.50 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేశారు.
ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన మిగతా 1.41 కోట్లకు పైగా కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభించనున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లబ్ధిదారుల ఇళ్లకే పంపించి కార్డులు పంపిణీ చేసి, అవి అందినట్లు రశీదులను స్వీకరించనున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వలంటీర్ల ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి కార్డును మంజూరు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.
కార్డుల పంపిణీ, ప్రత్యేకతలు ఇలా..
– తొలి దశలో శనివారం నుంచి కర్నూలు, వైఎస్సార్, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో అర్హులైన 39 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు.
– రెండో దశలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అర్హులైన 59 లక్షల కుటుంబాలకు హెల్త్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తారు.
– మూడో దశలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో అర్హులైన 43 లక్షల మంది కుటుంబాలకు వచ్చే నెల 25వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభించి మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు.
– క్యూఆర్ కోడ్ బార్ కలిగిన కొత్త వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులపై రేషన్ కార్డు నంబర్‌కు బదులు యునిక్ హెల్త్ గుర్తింపు నంబర్ ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నమోదవుతుంది. కుటుంబ యజమాని పేరు తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో ఉంటుంది. ఆ చిరునామాలో ఉంటున్న కుటుంబంలోని వారి పేర్లు కూడా ఉంటాయి. ఇంటి చిరునామా గుర్తింపు నంబర్‌ను కూడా ఇస్తున్నారు.
– కొత్త ఆరోగ్య శ్రీ కార్డులపై గ్రామ, వార్డు సచివాలయ కోడ్‌లను ముద్రిస్తారు.
– వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకూ వర్తింపు.
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించినా, ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందక పడుతున్న బాధలను వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వారికి సైతం లబ్ధి కలిగేలా ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో సైతం వైద్య సేవలు పొందేలా వీలు కల్పించారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment