వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు (గుంటూరు) : ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య నడుస్తున్న వివాదంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రతిఘటన తప్పదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ హెచ్చరించారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పరకాల ప్రభాకర్ అది చంద్రబాబు గొంతు కాదని ఒకసారి, ట్యాపింగ్ చేశారని మరోసారి అంతుపట్టని విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ గురించి మాట్లాడటం గురివింద గింజ సామెతను తలపిస్తోందని, ఆయన పుండాకోరు మాటలు మానుకోవాలని హితవు పలికారు.
మంత్రి దేవినేని ఉమా తాటతీస్తామని వ్యాఖ్యలు చేశారని, ప్రస్తుతం వారి తాట తీసే పనిలో ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయని చెప్పారు. దేవినేని ఉమా సంస్కారం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు మొదటి నుండి వంకరటింకరగా మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీలో కనపడ్డ కేంద్రనేతల కాళ్లు చంద్రబాబు పట్టుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఎంత నీతి, నిజాయితీ పరుడో ప్రజలకు అర్ధమైందని, విచారణకు వెళ్లే దమ్ము లేక ఫోన్ ట్యాపింగ్‌లంటూ కాకమ్మ కథలు చెబుతున్నారన్నారు.
మంత్రులు అవాకులుచవాకులు పేలితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పదవికి, ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మరణశాసనం రాసుకున్నారని, న్యాయస్థానం, ప్రజల ముందు నేరస్తుడిగా నిలబడటం తథ్యమన్నారు. నేతలు కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, ఉప్పుటూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్‌పై విమర్శలు చేస్తే ప్రతిఘటన తప్పదు
Published Sun, Jun 14 2015 12:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement