వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
ఆలమూరు : కోరుమిల్లిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డ్వాక్రా మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేసి ఆలమూరుకు తరలించారు. దీంతో బాధితుల ఆక్రందనలతో పోలీసుస్టేషన్ మార్మోగింది. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణితో పాటు మరో 45 మంది మహిళలను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళ కానిస్టేబుళ్లను సెక్యూరిటీ ఇచ్చి ఆటోలపై మహిళలను పలు ధపాలుగా తరలించారు. వీరిలో కొంతమందికి గాయాల పాలైనా పోలీసులు పట్టించుకోకపోవడంతో విలపిస్తున్నారు.
వివరాలు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కర్రి పాపారాయుడు, మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ల పట్టాభిరామన్న, జిల్లా యూత్ నాయకులు దూలం వెంకన్నబాబు తదితరులు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి బాధిత మహిళలను పరామర్శించారు. పలువురు మహిళలు కోరుమిల్లిలో పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని, తగిలిన గాయాల్ని వైఎస్సార్‌సీపీ నాయకులకు వివరించారు. గాయపడ్డ వారిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. మహిళలపై పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని వేగుళ్ల లీలాకృష్ణ, సిరిపురపు శ్రీనివాసరావు, ఏ.చంద్రరావు, టి.ప్రసన్నకుమార్ తదితరులు వ్యాఖ్యానించారు. అయితే ఈకేసుకు సంబంధించి సీపీఎం, సీఐటీయూ నాయకులతో పాటు డ్వాక్రా మహిళలపై 353 సెక్షన్ క్రింద నాన్ బెయిల్ బుల్ కేసు నమోదైంది.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఎం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు శేషుబాబ్జీ, కృష్ణవేణి అన్నారు. అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే పోలీసు శాఖ ముందే ప్రణాళికను సిద్ధం చేసి అరెస్ట్ పర్వానికి తెర తీసిందని వారు ఆరోపించారు.
బాధితుల ఆక్రందనలు
Published Sun, Jul 5 2015 1:57 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
Advertisement