హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ప్రజాస్వామ్యానికే మచ్చలాంటిదని... ఆ అంశంపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. ఈ కేసులో టీడీపీ నేతలు రెడ్హ్యాండెడ్గా దొరికినా కేసును నీరుగార్చేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ... పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించవలసిన వ్యూహాంపై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాజమండ్రిలో 29 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారని, ఆ దుర్ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కూడా పార్లమెంట్లో ప్రశ్నిస్తామని తెలిపారు.
అలాగే భూ సేకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి స్పెషల్ రైల్వే జోన్, ధాన్యానికి కనీస మద్దతు ధర, పునర్విభజన చట్టం హామీలను కూడా పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. ఇక భూ సేకరణ బిల్లులో కేంద్రం ముఖ్యమైన సవరణలు చేస్తే మద్దతిస్తామని మేకపాటి రాజమోహన్రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జులై 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు జరగనున్న సంగతి తెలిసిందే.