దొంగలెవరో తేల్చుకుందామా: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : రాజీనామాలపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఓవైపు విభజన ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు రాజీనామాలు వద్దంటోందని వారు మండిపడ్డారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ప్రజల్ని మభ్యపెట్టారని ఆరోపించింది.
విభజన ఆపడం తమ వల్లకాదని ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే ఉద్యమించేవారని పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. విభజన, సమైక్య డ్రామాలు ఆడేది ఎవరో తెలుస్తుందని అన్నారు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారో బయటపెట్టాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా దొంగలు ఎవరో... దొరలు ఎవరో తెలుస్తుందన్నారు. బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి అసెంబ్లీ సాక్షిగా తెలుస్తుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అన్నారు.
ప్రస్తుతం సమైక్యవాది నంటూ కొత్త ప్రకటనలు చేస్తున్నారని... ప్రతిపక్ష నేతలా ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రి నాటకాలు ఆడుతున్నారన్నారు. సీఎంకు నిజంగా విభజన ఆపాలని చిత్తశుద్ధి ఉంటే... కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని, తీర్మానం తర్వాత రాజీనామాలు ఆమోదించుకోవాలనే మూడు డిమాండ్లతో స్పీకర్‌ను కలుస్తామని శోభానాగిరెడ్డి వెల్లడించారు.