సమైక్యానికి కిరణ్ ఏం చేశారు? | ysrcp fires on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సమైక్యానికి కిరణ్ ఏం చేశారు?

Published Sun, Dec 8 2013 12:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ysrcp fires on kiran kumar reddy

సాక్షి, హైదరాబాద్: తన కుర్చీని కాపాడుకోవడానికి సమైక్య ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తమ పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు. విజయవాడ సభలో సీఎం కిరణ్ మాట్లాడిన అంశాలపై వైఎస్సార్ సీపీ నేతలు భూమా శోభానాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో స్పందించారు. వారంతా శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యోగులు చేపట్టిన సమ్మెను కిరణ్ మోసపూరితంగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

 

 విభజన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం గడిచిన నాలుగు నెలలుగా కుట్రలు చేస్తుంటే ఈ నాలుగు నెలలుగా కిరణ్ సీఎం కుర్చీని పట్టుకుని వేలాడుతూ, ఇప్పుడేమో మరెవరినో కూర్చోబెట్టమంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అసలు సమైక్యాంధ్ర అన్న మాటే వినపడకూడదనే దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని వారు దుయ్యబట్టారు. అసలు సమైక్యం కోసం కిరణ్ చేసిందేమిటని వారు సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామంటే ముందురాలేదు సరికదా... కనీసం అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తామెంతగా విజ్ఞప్తి చేసినా కిరణ్ పట్టించుకోలేదన్నారు.

 

 అందుకే మాపై బురదజల్లుతున్నారు..: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారని, రేపటి రోజున పార్లమెంట్‌లో వారంతా ప్రశ్నిస్తారనే ఆలోచనతోనే సోనియాగాంధీ ఆదేశాల మేరకు కిరణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి తమపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు.

 

సమైక్యం కోసం ఆయా జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతూ జగన్ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలే కాకుండా బయటి రాష్ట్రాల నేతలు కూడా ప్రశంసిస్తుంటే ఓర్వలేక రహస్యమిత్రులైన కిరణ్, చంద్రబాబులు ఒకేమాటగా తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిజంగా సమైక్యం కోరుకునేవారే అయితే రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ ప్రకటన రావడానికి ముందు ఏం చేశారు? నిర్ణయం వెల్లడించిన తర్వాత ఏంచేశారు? జూలై 30 సీడబ్ల్యూసీ విభజనపై నిర్ణయం తీసుకున్న నాలుగు నెలలకు ఇప్పుడు జగన్‌పై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. తాజాగా ప్రసారమవుతున్న నీల్సన్ సర్వే ఫలితాల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశముందని తేలడంతో ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు రావడంకోసం కిరణ్ తమపై విమర్శలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement